e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 28, 2021
Home News 'పాగల్‌'.. సినిమా రివ్యూ

‘పాగల్‌’.. సినిమా రివ్యూ

ఫలక్‌నుమా దాస్‌, ఈ నగరానికి ఏమైంది, హిట్‌ చిత్రాలతో యువతరం ప్రేక్షకులకు చేరువయ్యారు హీరో విశ్వక్‌సేన్‌. కథాంశాల ఎంపికలో వైవిధ్యతకు ప్రాధాన్యతనిస్తూ వరుస విజయాల్ని అందుకుంటున్నారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘పాగల్‌’. తొలిసారి విశ్వక్‌సేన్‌ నటించిన పూర్తిస్థాయి ప్రేమకథా చిత్రమిది. ఈ చిన్న సినిమాకు అగ్ర నిర్మాత దిల్‌రాజుకు సమర్పకుడిగా వ్యవహరించడంతో అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది. ఈ సినిమా ద్వారా నరేష్‌ కుప్పిలి దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ ప్రేమకథా చిత్రంతో విశ్వక్‌సేన్‌ తన విజయపరంపరను కొనసాగించాడా? చిన్న సినిమాపై దిల్‌రాజు పెట్టుకున్న నమ్మకం నిజమైందా?లేదా?తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.


ప్రేమ్‌(విశ్వక్‌సేన్‌) చిన్నతనంలోనే తల్లి ప్రేమకు దూరమవుతాడు. తాను కోల్పోయిన ప్రేమను తిరిగి పొందడానికి ప్రయత్నిస్తుంటాడు. నిజాయితీగా ఎవరినైనా ప్రేమిస్తే తిరిగి వారు మనకు అంతే స్వచ్ఛంగా ప్రేమను పంచుతారు అని అమ్మ చెప్పిన మాటకు కట్టుబడి కనిపించిన అమ్మాయిలందరికీ ఐ లవ్‌ యూ చెబుతుంటాడు. రాధ(మేఘ లేఖ), మ్యూజిక్‌ కాలేజీ అమ్మాయి(సిమ్రాన్‌ చౌదరి), మహాలక్ష్మీలను గాఢంగా ప్రేమ్‌ ప్రేమిస్తాడు. అనివార్య కారణాల వల్ల మధ్యలోనే ఆ ప్రేమాయణాలకు బ్రేకప్‌ పడటంతో ప్రేమ్‌ ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటాడు.

- Advertisement -

చనిపోవడానికి సిద్ధమైన ప్రేమ్‌ జీవితంలోకి తీర(నివేదా పేతురాజ్‌) ప్రవేశిస్తుంది. ఆమె ఎవరూ? అప్పటికే నిశ్చితార్థం అయిపోయిన తీరతో ప్రేమ్‌ ఎలా ప్రేమలో పడ్డాడు? వైజాగ్‌లో మొదలైన వారి ప్రేమకథకు హైదరాబాద్‌ రాజకీయ నాయకుడు రాజిరెడ్డి(మురళీశర్మ) ఉన్న సంబంధమేమిటి? తాను ఆశించిన ప్రేమను ప్రేమ్‌ పొందగలిగాడా?లేదా? అన్నదే ఈ చిత్ర ఇతివృత్తం.


ప్రేమను అన్వేషిస్తూ ఓ యువకుడు సాగించే ప్రయాణమే ఈ చిత్ర ఇతివృత్తం. తాను కోల్పోయిన తల్లి అనురాగాన్ని, లాలనను ప్రేమించిన అమ్మాయి ద్వారా తిరిగి పొందాలని తపించే ఓ యువకుడి కథకు ఎమోషన్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ను మిక్స్‌ చేస్తూ దర్శకుడు ఈ కథను రాసుకున్నారు. ఈ పాయింట్‌కు అంతర్లీనంగా రివేంజ్‌ డ్రామాను మిళితం చేస్తూ కుటుంబ ప్రేక్షకులతో పాటు యువతరం ప్రేక్షకుల అభిరుచులను దృష్టిలో పెట్టుకొని సినిమాను తెరకెక్కించారు.


ఈ కథలో ప్రధాన పాయింట్‌ ఏమిటనే అంశాన్ని ప్రారంభమైన ఐదు నిమిషాలకే వివరిస్తూ దర్శకుడు సినిమాను ఆసక్తికరంగా మొదలుపెట్టారు దర్శకుడు. కనబడిన ప్రతి అమ్మాయిని ప్రేమిస్తున్నానంటూ ప్రేమ్‌ వెంటపడే సన్నివేశాలతో ప్రథమార్థం సరదాగా సాగిపోతుంది. ఫెయిల్యూర్‌ లవ్‌స్టోరీస్‌ను పాజిటివ్‌గా తీసుకుంటూ హీరో సాగించే అన్వేషణ నుంచి కావాల్సినంత వినోదాన్ని రాబట్టుకున్నారు. నవ్వులతో సాగిపోతున్న కథను మురళీశర్మను చంపడానికి హీరో ప్రయత్నించే విరామ సన్నివేశంతో రివేంజ్‌ డ్రామాలోకి మలుపుతిప్పారు. ద్వితీయార్థం మొత్తం యాక్షన్‌గా ఉంటుందని ఆశించిన ప్రేక్షకుల ఊహలకు భిన్నంగా తీరతో ప్రేమ్‌ పరిచయం, వారి ప్రేమకథతో ఎమోషనల్‌గా నడిపించారు. పతాక ఘట్టాలను భిన్నంగా ముగించారు.


ఐదు సినిమాల ప్రయాణంలో ఎక్కువగా మాస్‌, కామెడీ పాత్రల్లోనే కనిపించారు విశ్వక్‌సేన్‌. ఫుల్‌లెంగ్త్‌ ప్రేమకథను ఎంచుకొని ఆయన చేసిన తొలి చిత్రమిది. తల్లి ప్రేమకు దూరమై వేదనను అనుభవించే కొడుకుగా, ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవాలని ఆరాటపడే ప్రేమ అనే యువకుడిగా చక్కటి వేరియేషన్స్‌ను చూపిస్తూ నటించాడు. తనదైన మేనరిజమ్స్‌తో ప్రథమార్థం ఆకట్టుకున్నాడు. ఎమోషనల్‌ సన్నివేశాల్లో పరిణతితో కూడిన నటనను కనబరిచాడు. కథానాయికల్లో నివేదా పేతురాజ్‌ పాత్ర సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. తీర పాత్రలో సహజ నటనతో ఆకట్టుకున్నది. పతాక ఘట్టాల్ని తన నటనతో నిలబెట్టింది. మేఘలేఖ, సిమ్రాన్‌ చౌదరితో పాటు మరో అమ్మాయి పాత్రలు వినోదం కోసమే ఉపయోగపడ్డాయి. రెగ్యులర్‌ క్యారెక్టర్స్‌ భిన్నంగా వినూత్నమైన పాత్రలో మురళీశర్మ కనిపించారు. రాహుల్‌ రామకృష్ణ, రాంప్రసాద్‌, మహేష్‌లపై తెరకెక్కించిన కామెడీ కొంత వర్కవుట్‌ అయ్యింది.


దర్శకుడు నరేష్‌కు ఇదే తొలి సినిమా. ఎమోషనల్‌ సన్నివేశాలను చక్కగా రాసుకున్నారు. తాను కోల్పోయిన తల్లి ప్రేమను పొందడానికే అమ్మాయిల వెంట పడుతున్నానంటూ హీరో చేసే ప్రయత్నాల్ని వినోదాత్మకంగానే ఎక్కువగా చూపించారు దర్శకుడు. దాంతో కథలో సీరియస్‌నెస్‌ మిస్‌ అయ్యింది. ప్రతీకార సన్నివేశాల్లో లాజిక్‌ కనిపించదు. ప్రేమ, తీర లవ్‌స్టోరీని నాటకీయత సరిగా పండలేదు. మణిరత్నం, పవన్‌కల్యాణ్‌లపై తనకున్న ఇష్టాన్ని కొన్ని సన్నివేశాల్లో దర్శకుడు చూపించారు. అవీ బాగా వర్కవుట్‌ అయ్యాయి.

రధన్‌ నేపథ్య సంగీతం, బాణీలు ఈ ప్రేమకథకు ప్రాణంపోశాయి. తన సంగీతంతో కథలోని ఫీల్‌ను స్క్రీన్‌పై మరింతగా ఎలివేట్‌ చేశారు రధన్‌. మణికందన్‌ ఛాయాగ్రహణం బాగుంది. కొత్త దర్శకుడి కథను నమ్మి చిన్న సినిమా అయినా అత్యున్నత ప్రమాణాలతో దిల్‌రాజు, బెక్కెం వేణుగోపాల్‌ ఈసినిమాను నిర్మించారు.ప్రేమను కొత్త కోణంలో ఆవిష్కరించాలని చిత్రబృందం చేసిన ప్రయత్నమిది. అయితే కథలో ఉన్న కొత్తదనం స్క్రీన్‌ప్లేలో మాత్రం కనిపించలేదు. రెగ్యులర్‌ కమర్షియల్‌ ఫార్ములాలతోనే తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరిస్తారో చూడాల్సిందే.

రేటింగ్‌-2.75/5

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana