ప్రముఖ దర్శకుడు సుకుమార్ తనయ సుకృతి వేణి ప్రధాన పాత్రలో నటించిన ‘గాంధీ తాత చెట్టు’ చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయమవుతున్నది పద్మావతి మల్లాది. ఈ సినిమా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా దర్శకురాలు పద్మావతి మల్లాది సోమవారం పాత్రికేయులతో ముచ్చటించింది. తన నేపథ్యం గురించి చెబుతూ ‘నా స్వస్థలం హైదరాబాద్. పీజీ పూర్తయ్యాక చంద్రశేఖర్ యేలేటి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశా.
‘రాధేశ్యామ్’కు రచయితగా, ‘మహానటి’ చిత్రానికి డైలాగ్ రైటర్‌గా వర్క్ చేశా. ‘బృంద’ అనే వెబ్‌సిరీస్‌కు రచయితగా పనిచేశా’ అని చెప్పింది. తన స్నేహితుడు చెట్టుకు, మనిషికి మధ్య లవ్‌స్టోరీ రాస్తే బాగుంటుందని చెప్పడంతో ఆ ఐడియా నుంచి ‘గాంధీ తాత చెట్టు’ కథ రాసుకున్నానని, ఒక అమ్మాయి అహింసావాదంతో ఊరిని, చెట్టుని ఎలా కాపాడిందన్నదే కథాంశమని వివరించింది. ఈ సినిమాలో సందేశంతో పాటు, హృదయాన్ని కదిలించే భావోద్వేగాలుంటాయని తెలిపింది.
‘నిజామాబాద్ జిల్లాలోని రంగంపేట అనే ఊరిలో చిత్రీకరణ జరిపాం. ఈ కథ 1947లో గాంధీగారు చనిపోయినప్పుడు తాత నాటిన చెట్టుతో ప్రారంభమవుతుంది’ అని పద్మావతి మల్లాది పేర్కొంది. ఈ సినిమాలో సుకృతి వేణి..గాంధీ అనే పాత్రలో కనిపిస్తుందని, సహజమైన అభినయంతో మెప్పించిందని, రెండు నెలల పాటు వర్క్‌షాప్స్ నిర్వహించి, 25 రోజుల్లో చిత్రీకరణ పూర్తిచేశామని చెప్పింది. ఈ సినిమా ద్వారా గాంధీగారి అహింస సిద్ధాంతం, మనుషులు-ప్రకృతికి మధ్య ఉండాల్సిన సంబంధం గురించి తెలియజెప్పానని ఆమె తెలిపింది.