హాస్యనటచక్రవర్తి పద్మశ్రీ రేలంగి అవార్డును నటుడు, మాజీ మంత్రి డా.బాబుమోహన్ అందుకున్నారు. 41ఏండ్ల నటజీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగు ఫిల్మ్ టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ అండ్ భారత్ కల్చరల్ అకాడమీ సంస్థ ఆయనకు ఈ అవార్డును అందజేసింది. ఈ సందర్భంగా హైదరాబాద్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాతల మండలి కార్యదర్శి టి.ప్రసన్నకుమార్, నాగబాల సురేశ్, నటుడు రాంకీ, 30ఇయర్స్ పృథ్వీరాజ్ తదితరులు అతిథులుగా పాల్గొని తెలుగు సినిమాకు బాబుమోహన్ చేసిన సేవలను కొనియాడారు.
ఆయనతో తమ అనుభవాలను గుర్తుచేసుకున్నారు. బాబుమోహన్ మాట్లాడుతూ ‘రేలంగి అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది. ఈ 41ఏండ్ల నట జీవితంలో నన్ను పోత్సహించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అవార్డుల కంటే ప్రజల ఆశీస్సులే గొప్ప దీవెన. ఇక ‘పద్మ’ అవార్డు వస్తే సంతోషం. రాకపోయినా ఫర్వాలేదు’ అని బాబుమోహన్ అన్నారు.