భారతీయులది వ్యవసాయ సంస్కృతి. ఇక్కడి పండుగలు, పబ్బాలు, ఉత్సవాలు అన్నీ వ్యవసాయం, పరిసరాలతోపాటు జీవన విధానాల ప్రకారం రూపుదిద్దుకున్నాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో తెలుగువారి పండుగల్లో సంక్రాంతి ఒకటిగా కనిపిస్తుంది. ‘సంక్రాంతి’ అంటే కొత్త వెలుగు. తెలుగు రాష్ర్టాలతోపాటు తమిళనాడులోనూ ఈ పండుగను వైభవంగా చేసుకుంటారు. ఉత్తరాదిలోనూ వివిధ పేర్లతో జరుపుకొంటారు. కారణాలేమైనా తొలి నుంచి తెలుగు సినిమా సంక్రాంతి పండుగను అనేక రకాలుగా వెండితెర మీద చూపించింది. లెక్కలేనన్ని పాటలు, సంఘటనలతో పాటు ఈ పేరుతో, కథా నేపథ్యంతో సినిమాలు కూడా రూపొందాయి. కానీ, నాలుగు కోట్లమంది జరుపుకొనే బతుకమ్మ వంటివి అరుదు.. అవి కూడా సినారె రాసినవే చూడొచ్చు.
సినారె పండుగ పాటలు ఎన్నో రాశారు.
వాటిలో ‘గౌరమ్మ తల్లికి బోనాలు దుర్గమ్మ తల్లికి జేజేలు’ (దత్తపుత్రుడు), ‘ఈనాడే దసరా పండుగ’ (పెద్ద కొడుకు), ‘సంకురాత్రి అల్లుడూ! సంకలెగురేసు కొచ్చిండు’ (రాధమ్మ పెళ్ళి), ‘కాముడు కాముడు వల్లో’ (స్వయంకృషి) గీతాలు కొన్ని. ఇవేకాక సీమంతం, పుట్టినరోజు, పెళ్లి ఇలా సినారె గీతాలు అనేకం కనిపిస్తాయి. 1987లో విడుదలైన ‘ఇంటిదొంగ’ కోసం సినారె నాలుగు గీతాలు రాశారు. శ్రీలలిత కళాంజలి ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. నందమూరి కళ్యాణకృష్ణ, అశ్విని, రావుగోపాలరావు, అన్నపూర్ణ, కోడి రామకృష్ణ ప్రధాన తారాగణం. గ్రామీణ నేపథ్యంలో సాగే కథలో సంక్రాంతి పండుగ గురించి, నేపథ్యాన్ని గురించి సాగే “వచ్చింది వచ్చింది సంక్రాంతి” అనే గీతాన్ని డా॥సి.నారాయణరెడ్డి రాయగా, కె.వి.మహదేవన్ సంగీతాన్ని అందించారు. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం దీనిని గానం చేశారు.
బృందం: గొబ్బిల్లో గొబ్బిల్లో గుమ్మడిపూల గొబ్బిళ్లో
గొబ్బిల్లో గొబ్బిల్లో గోమాలక్ష్మి గొబ్బిళ్లో
పల్లవి:
వచ్చింది సంక్రాంతి వచ్చింది
పచ్చపచ్చాని సంబరాలు తెచ్చింది ॥వచ్చింది॥
పంటగ ఎదిగే పాల పొంగై
ఏరువాకల పూతరేకులు..
ఇంటింటా ఇచ్చింది ॥వచ్చింది॥
ప్రకృతితో.. పర్యావరణంతో… వ్యవసాయంతో… పంటతో ముడిపడిన పండుగల్లో సంక్రాంతి ప్రధానమైనది. రైతన్నల ఇంట నవధాన్యాలు రాశిగా మారిన సంబురం పండుగైతే అది సంక్రాంతి అవుతుంది. అందులోనూ ఆవుపేడతో చేసిన గొబ్బిళ్లను వాకిట్లో, నట్టింట్లో పెట్టి వాటిని బంతులు, ముద్దబంతులు, చేమంతులతో సింగారించి, నవధాన్యాలు, రేగుపండ్లతో అలంకరించి పూజిస్తాం. ప్రకృతికి.. మనిషికి ఉన్న గొప్ప సంబంధాన్ని తెలిపే క్రియ ఇది. ఆడపిల్లలు ఆడే గొబ్బిళ్లాటతో ఈ గీతాన్ని మొదలుపెట్టడం విశేషం. సినారెది వ్యవసాయ కుంటుంబం. పంట గురించి, పైరు గురించి… ఆ పంట ఇంటి గాదెలు, కాగుల్లో నిండిన ‘సంబురం’ గురించి ఆయనకు బాగా తెలుసు. అందుకే ఈ గీతంలో ‘పంటగ ఎదిగే’ అన్న ప్రయోగం చేశారు సినారె. పొంగలి వండి, పాలు పొంగించడం దక్షిణాదిన చూస్తాం. దానినే ‘పాలై పొంగే ఏరువాక’ అంటూ తీపిని కురిపించారు.
సంక్రాంతి అనగానే ప్రధానంగా గుర్తొచ్చేది అమ్మలు, అక్కలు, ఆడబిడ్డలు ఎగిలివారంగ లేచి అందమైన రంగల్లులతో ఇంటిని, వాకిలిని, ఊరూవాడను అలంకరించడం. దీనికి తోడు సబ్బండ వర్ణాలు గాదెల వద్ద తమ హక్కు అయిన పంటను ఇంటికి తెచ్చువకోడం… ఇంకా గంగిరెద్దుల ఆటలు… హరిదాసుల పాటలు పండుగకు మరింత అందాన్ని తెస్తాయి. ఇక కోస్తా ప్రాంతంలోనైతే ఎడ్ల పందాలు, కోడి పందాల గురించి, ఇంటికొచ్చే అల్లుళ్ల గురించి చెప్పాల్సిన పనిలేదు. చరణంలో ప్రధాన ఆకర్షణ అయిన హరిదాసులను గురించి చెబుతారు కవి.
చరణం:
హరిహరిలో రంగ హరి / హరి హరిలో రంగహరి
ఏవండి హరిదాసుగారూ
ఈ పాటలెన్నాళ్లని పాడుతారు ॥2॥
ప్రతి ఇంట కథలెన్నో ఉన్నాయి
అవి పాటలుగా మురుతున్నాయి
అవి మేము వింటేనే ఆనందదాయకం
ఉన్నది అంటేనే ఉభయతారకం
తమకు ముక్తి, భుక్తిదాయకమైన హరినామాన్ని కీర్తించే హరిదాసును కవి ఇక ‘పాడిన పాత పాటలకు కాలం చెల్లింది’ అని నర్మగర్భంగా చెబుతూ బతుకు పాటలను గానం చేయమనడం ఆధునికతకు నిదర్శనం. నిజానికి కవి సినారె హరిదాసు పరంగా ఈ మాటలు చెప్పినప్పటికీ సినిమా పరంగా ఇందులో వ్యంగ్యం కూడి ఉంది. అందుకే వెంటనే ‘వింటేనే ఆనందదాయకం’, ‘అంటేనే ఉభయతారకం’ అనడం. అంతేకాదు ఆ తర్వాత ‘ఆనాడే అసలైన పండుగ’ అని చెబుతారు. సంక్రాంతితో ముడిపడి ఉన్న బసవన్నల గురించి కూడా ఇందులో చెబుతారు కవి… అది కూడా వ్యంగ్యంగా…. చూడండి.
చరణం:
ఏవండి బసవన్న గారూ..
తమరు ఎన్నాళ్లు తలవూపుతారు
ఈ పాటలెన్నాళ్లని పాడుతారు
ఉన్నదొకే కాలు ధర్మానికి అది
ఉండుండి విరిగింది ఖర్మానికి…
పై చరణంలో కవి గంగిరెద్దు బసవన్న గురించి ప్రస్తావన తెచ్చినప్పటికీ కథా సందర్భపరంగా పెళ్లాం చెప్పి మాటలకు ‘తలవూపే’ బసవన్న గురించి! అయితే అందరికీ వర్తించే విధంగా సామాన్యీకరించి కవి చెప్పడం ఇందులో చూడవచ్చు. ధర్మం నాలుగు పాదాల మీద నడస్తుందని, అయితే ఈ కలియుగంలో అది ఒంటి కాలికి పరిమితమై కుంటుతున్నదన్న మాటకు సినారె చక్కగా పేర్చిన గీత అల్లిక ఇది. పెళ్లాం బెల్లమైతే కన్నవారి గోస ఎలా ఉంటుందో తరువాతి చరణాల్లో కవి చెబుతారు. చెప్పడమే కాదు అటువంటప్పుడే ‘ఏ పండుగైనా దండగే’ అంటారు. సంక్రాంతి నేపథ్యంగా అటు సంప్రదాయాన్ని, సంస్కృతిని వర్ణిస్తూనే వ్యంగ్యాన్ని, నూతనత్వాన్ని చెప్పడం సినారెకే చెల్లింది… చెల్లుతుంది కూడా!
– పత్తిపాక మోహన్