Pa Ranjith | కోలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ పా. రంజిత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సామాజిక అంశాలు, దళితుల పోరాటాలు, అణగారిన వర్గాల అన్యాయాలను బలమైన కథలుగా మలచడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అంబేద్కర్ భావజాలాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రజల్లో చైతన్యం రగిలించే చిత్రాలను తెరకెక్కిస్తూ వస్తున్న ఈ దర్శకుడు, ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్‌తో మళ్లీ వార్తల్లో నిలిచారు. తాజా సమాచారం ప్రకారం, పా. రంజిత్ దర్శకత్వంలో అక్కినేని కోడలు శోభిత ధూళిపాళ నటించబోతున్నారట. గతేడాది విక్రమ్‌తో ‘తంగలాన్’ అనే సినిమా తెరకెక్కించిన రంజిత్, ఇప్పుడు కాస్త గ్యాప్ తీసుకుని తన తదుపరి సినిమాపై ఫోకస్ చేస్తున్నారు. ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ, ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతుందని టాక్ వినిపిస్తోంది.
సినిమాకు తాత్కాలికంగా ‘వెట్టువం’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సమ్మర్ రిలీజ్ లక్ష్యంగా షూటింగ్ చేస్తున్నారు. ఇటీవలే సినిమా యూనిట్, ప్రధాన తారాగణంతో కలిసి ఓ భారీ వరద సీక్వెన్స్ చిత్రీకరించినట్లు తమిళ వర్గాలు వెల్లడించాయి. ఇందులో ‘అట్టకత్తి’ ఫేమ్ దినేష్ హీరోగా నటిస్తుండగా, ఆయనకు జోడీగా శోభిత ధూళిపాళ కనిపించనుందని సమాచారం. నాగ చైతన్యను గత సంవత్సరం డిసెంబర్లో వివాహం చేసుకున్న తర్వాత శోభిత ఇప్పటివరకు కొత్త ప్రాజెక్ట్ ఏదీ అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఆమె అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఓ వెబ్ సిరీస్ చేస్తోందని, అలాగే ఒక సినిమా షూటింగ్లో కూడా పాల్గొంటున్నారని తెలిసింది.
మరోవైపు, ఈ సినిమాలో ఆర్య నెగటివ్ రోల్ చేస్తున్నారని తమిళ మీడియా రిపోర్ట్స్ చెబుతున్నాయి. పా. రంజిత్ దర్శకత్వంలో ఆర్య ఇంతకుముందు నటించిన ‘సార్పట్టా పరంబరై’ ఓటీటీలో ఘనవిజయం సాధించింది. దానికి సీక్వెల్‌గా ‘సార్పట్టా 2’ చేయాలని భావిస్తున్నా, అంతకంటే ముందుగా రంజిత్ కొత్త ప్రాజెక్ట్ ‘వెట్టువం’ లో ఆర్యకు విలన్ రోల్ ఇచ్చారని టాక్. పా. రంజిత్–శోభిత ధూళిపాళ–ఆర్య కాంబినేషన్లో వస్తోన్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. అయితే ఇందులో నిజమెంత అనేది తెలుసుకోవాలంటే, అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాల్సిందే.