రాజమౌళి తర్వాత వందశాతం సక్సెస్ రేట్ ఉన్న దర్శకుడెవరంటే టక్కున వచ్చే సమాధానం అనిల్ రావిపూడి. ఏడాదిన్నర క్రితం ‘భగవంత్‌కేసరి’తో బాక్సాఫీస్‌ని షేక్ చేసిన ఈ యంగ్ డైరెక్టర్.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ అంటూ అసలు సిసలైన సంక్రాంతి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వెంకటేశ్ హీరోగా దిల్‌రాజు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం విలేకరులతో ముచ్చటించారు అనిల్ రావిపూడి.
వెంకటేష్‌గారితో చేసిన ‘ఎఫ్ 2’ పొంగల్‌కి వచ్చి పెద్ద హిట్ అయ్యింది. ‘ఎఫ్3’ కూడా పొంగల్‌కే తేవాలనుకున్నాం. కానీ కుదర్లేదు. ఈసారి చేసే సినిమా తప్పకుండా సంక్రాంతికే తీసుకురావాలని ఓపెనింగ్ రోజునే ఫిక్స్ అయ్యాం. ఓ రెస్క్యూ ఆపరేషన్‌కి సంబంధించిన కథ ఇది. సెకండాఫ్‌లో నాలుగురోజుల ప్రయాణం సాగించిన ఈ కథ.. సరిగ్గా సంక్రాంతి ముందు ల్యాండ్ అవుతుంది. అందుకే ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్ కరెక్ట్ అని కథ అనుకున్నప్పుడే ఫిక్స్ అయ్యాం.
సినిమా తీయడం కంటే.. సినిమాను జనాలకు చేర్చడమే ఇప్పుడు మేకర్స్‌కి పెద్ద టాస్క్. కోవిడ్ తర్వాత సినిమా సినారియో మారింది. అందుకే.. ప్రమోషన్స్ కాస్త గట్టిగానే చేశాం. వెంకటేష్ బాగా సహకరించారు. రమణగోగుల పాడిన ‘గోదారి గట్టు’ పాట కూడా ప్రమోషన్స్‌కి బాగా హెల్ప్ అయ్యింది. 85 మిలియన్స్ వ్యూస్‌ని క్రాస్ చేసి గ్లోబల్ సాంగ్‌గా నిలిచింది. వెంకటేష్‌గారు పాడిన పొంగల్ సాంగ్ కూడా అందరికీ నచ్చింది. మొత్తంగా భీమ్స్ మెమరబుల్ ఆల్బమ్ ఇచ్చాడు. దిల్‌రాజు, శిరీష్‌గార్లతో నాది పదేళ్ల ప్రయాణం. వాళ్లతో బాగా కనెక్టయిపోయా. అందుకే వాళ్లతో జర్నీ చేయడానికి ఇష్టపడతా.
ఐశ్వర్య రాజేష్ కేరక్టర్ పేరు భాగ్యం. గోదారి అమ్మాయి. ఆ యాస, ఆ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో చూసుకునేందుకు చిన్న ఆడిషన్ చేశాం. ఐశ్వర్య రాజేష్‌కి మంచి పేరు తెస్తుందీ సినిమా. అలాగే మీనాక్షి చౌదరి కూడా బాగా చేసింది. ఇక వెంకటేశ్‌గారితో ఎఫ్ 2, ఎఫ్ 3 తర్వాత చేసిన సినిమా ఇది. ఈ సినిమాతో మా బాండింగ్ డబుల్ అయ్యింది. ఈ సారి వెంకీగారితో డిఫరెంట్‌గా జోనర్ ట్రై చేశాను. వెంకటేష్‌గారితో యాక్షన్ సినిమా చేసినా.. వినోదానికే పెద్దపీట వేస్తా. ఓ భార్య, ఓ మాజీ ప్రేయసి మధ్య నలిగే ఓ భర్త కథ ఇది. ప్రతి ఫ్యామిలీ రిలేట్ చేసుకునేలా, రెండు గంటలపాటు ఆడియన్స్ హాయిగా నవ్వుకునేలా సినిమా ఉంటుందని కాన్ఫిడెంట్‌గా చెబుతున్నా. త్వరలో ‘ఎఫ్ 4’ కూడా ఉంటుంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’కి కూడా ఫ్రాంచైజీ స్కోప్ ఉంది.