ఓటీటీ హిట్
ఐసీ 814: ద కాందహార్ హైజాక్
నెట్‌ఫ్లిక్స్: స్ట్రీమింగ్ అవుతున్నది
నటీనటులు: విజయ్ వర్మ, నసీరుద్దిన్ షా, అరవింద స్వామి,కుముద్ మిశ్రా, రాజీవ్ ఠాకూర్
దర్శకత్వం : అనుభవ్ సిన్హా,త్రిశాంత్ శ్రీవాస్తవ
1999లో యావత్ ప్రపంచం ఉలిక్కిపడ్డ సంఘటన కాందహార్ హైజాక్. ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన పౌరవిమానం నేపాల్ రాజధాని ఖాట్మండులో హైజాక్‌కు గురికావడం, కాందహార్‌కు చేరుకోవడం, ఉగ్రవాదుల డిమాండ్లు.. ఇవన్నీ ఓ సంచలనం. పాతికేండ్ల కిందట జరిగిన ఈ సంఘటన ఆధారంగా తెరకెక్కిన వెబ్‌సిరీస్ ‘ఐసీ 814: ద కాందహార్ హైజాక్’ ఇప్పుడు రికార్డు స్ట్రీమింగ్ నమోదు చేసుకుంటున్నది. వాస్తవిక కథను నిర్మించేటప్పుడు చాలా పరిధులు ఉంటాయి. కథ, పాత్రలు, సంభాషణలపై మరింత దృష్టి సారించాల్సి ఉంటుంది. ఏ మాత్రం అటూ ఇటూ అయినా.. ప్రజల మనోభావాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. వాస్తవాలు పక్కదారి పట్టిస్తే.. చరిత్ర కూడా క్షమించదు. ఈ అంశాలన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ‘ఐసీ 814 : ద కాందహార్ హైజాక్’ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తెచ్చారు దర్శకులు.
కథ ఏంటంటే..?
176 మంది ప్రయాణికులతో ఖాట్మండు నుంచి ఢిల్లీ బయలుదేరిన ‘ఐసీ 814’ విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేస్తారు. కెప్టెన్ తలపై తుపాకీ గురిపెట్టి విమానాన్ని కాబూల్‌కు తీసుకెళ్లాలని బెదిరింపులకు పాల్పడతారు. ఉగ్రవాదులు విమానాన్ని ఎందుకు హైజాక్ చేశారు? వాళ్ల డిమాండ్స్ ఏంటి? ఆ విమానం కాబూల్ ఎలా చేరింది? ఉగ్రవాదులు చేసిన డిమాండ్లను నెరవేర్చేందుకు భారత ప్రభుత్వానికి ఎదురైన ఇబ్బందులు ఏంటి? ప్రయాణికులను, విమాన సిబ్బందిని సర్కారు ఎలా కాపాడింది? అనేది మిగిలిన కథ.
‘ఒకసారి నువ్వు తుపాకీ పట్టుకున్నావు అంటే.. ఒకరి ప్రాణం తీసేటప్పుడు వెయ్యిసార్లు ఆలోచించాలి. అదే ఒక ప్రాణం కాపాడటానికి ఆలోచించనక్కర్లేదు. రండి.. ఇది ప్రజలను కాపాడాల్సిన సమయం’ సిరీస్ చివరి ఎపిసోడ్లో దేశానికి చెందిన ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య జరిగే సంభాషణ ఎమోషనల్‌గా ఉంటుంది. కెప్టెన్ దేవీశరణ్, శ్రింజయ్ చౌధురి రాసిన ‘ఫ్లైట్ ఇన్ టూ ఫియర్’ పుస్తకం ఆధారంగా కథను రాసుకున్నారు దర్శకులు. ఆరు ఎపిసోడ్లుగా దీనిని నిర్మించారు. ఒక్కో ఎపిసోడ్ నిడివి సుమారు 40 నిమిషాలు. వారాంతంలో మంచి కాలక్షేపం అని చెప్పొచ్చు.