బాలీవుడ్ తార సోనాక్షి సిన్హా నటించిన మొదటి వెబ్‌సిరీస్ ఇది. క్రైమ్ సస్పెన్స్ కథాంశంతో ఓటీటీకెక్కిన ‘దహాడ్’కు ఊహించిన దానికన్నా ఎక్కువ స్పందనే వస్తున్నది. కథలోకి వెళ్తే రాజస్థాన్‌లోని మాండ్వా పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐగా పనిచేస్తుంటుంది అంజలి భాటియా (సోనాక్షి). ఈ స్టేషన్ పరిధిలో కృష్ణా చందాల్ అనే యువతి ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోతున్నట్టు లేఖరాసి కనిపించకుండా పోతుంది. కృష్ణా చందాల్ సోదరుడు పోలీసుల చుట్టూ తిరుగుతుంటాడు. కేసు పరిష్కార బాధ్యతలు అంజలికి అప్పగిస్తారు అధికారులు. నేర పరిశోధనలో విస్తుపోయే నిజాలు వెల్లడవుతాయి. కృష్ణా చందాల్ ఆచూకీ కోసం వెతుకుతున్న ఆమె.. రాష్ట్రంలో దాదాపు 27 మంది యువతులు ఇలాగే లేఖరాసి ఇంట్లోంచి వెళ్లిపోయినట్టు గుర్తిస్తుంది.
అంతలోనే కృష్ణా చందాల్ మృతదేహం లభ్యమవుతుంది. ఆమె సైనైడ్ మింగడం వల్ల చనిపోయిందని పోస్టుమార్టం రిపోర్టు ద్వారా తెలుస్తుంది. ఇంతకూ ఆమె ఆత్మహత్య చేసుకుందా? ఎవరైనా హత్య చేశారా? మిగిలిన యువతులు బతికే ఉన్నారా? చనిపోయారా? పోలీసులు నేరస్తులను పట్టుకున్నారా? ఇది మిగిలిన కథ. ఆసక్తికరంగా మలిచిన ఈ వెబ్‌సిరీస్‌కు ఓటీటీలో మంచి ఆదరణ లభిస్తున్నది. మొత్తం ఎనిమిది ఎపిసోడ్లు ఉండగా, నిడివి కాస్త పరీక్ష పెడుతుంది. హిందీతోపాటు తెలుగు, తమిళం ఇతర భాషల్లోనూ డబ్బింగ్ వెర్షన్ అందుబాటులో ఉంది. క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి దహాడ్ మంచి కాలక్షేపం. అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని.. వెనుకబడిన కులానికి చెందిన అంజలి నిలదీసే ఘట్టాలను జోడించి కొంత సామాజిక కోణాన్నీ అద్దారు దర్శకులు.