Oscars 2025 | ప్రపంచ సినీ ఉత్సవంగా అభివర్ణించే ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం లాస్ఏంజిల్స్లో డాల్భీ థియేటర్లో తారల తళుకుబెళుకుల నడుమ కన్నులపండువగా జరిగింది. అతి తక్కువ బడ్జెట్లో ఓ వేశ్య నేపథ్య కథాంశంతో రూపొందించిన ‘అనోరా’ చిత్రం ఈ ఏడాది ఐదు పురస్కారాలను గెలుచుకొని అగ్ర భాగాన నిలిచింది. సీన్ బేకర్ దర్శకత్వంలో రొమాంటిక్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆస్కార్ బరిలో పదమూడు నామినేషన్స్ దక్కించుకున్న మ్యూజికల్ డ్రామా ‘ఎమిలియా పెరేజ్’ కేవలం రెండు అవార్డులకే పరిమితమైంది. ఇక ఈ ఏడాది అవార్డుల్లో భారతీయ చిత్రాలకు నిరాశే ఎదురైంది. లైవ్ యాక్షన్ షార్ట్‌ఫిల్మ్ కేటగిరీలో భారత్ నుంచి పురస్కారం గ్యారంటీ అని భావించిన ‘అనూజ’ చిత్రానికి అదృష్టం కలిసి రాలేదు. బుల్లితెర ప్రయోక్తగా పేరుపొందిన కానన్ ఓ బియన్ ఈ 97వ ఆస్కార్ వేడుకలకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఇటీవల లాస్ఏంజిల్స్ కార్చిచ్చు దుర్ఘటనలోని మృతులకు నివాళులర్పించిన అనంతరం ఆస్కార్ ప్రదానోత్సవ ఘట్టాన్ని ఆరంభించారు.
రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ‘అనోరా’ ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే, ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో పురస్కారాలను గెలుచుకొని సంచలనం సృష్టించింది. సీన్ బేకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మైకీ మ్యాడిసన్, మార్క్ ఎడిల్జియన్, యురా బోరిసావ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. అమెరికా బ్రూక్లిన్‌లో నివసించే అని అనే ఓ స్ట్రిప్ డ్యాన్సర్ కథ ఇది. వృత్తిలో భాగంగా ఆమెకు రష్యా సంపన్న కుటుంబానికి చెందిన వన్య అనే వ్యక్తి పరిచయం అవుతాడు. ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. ఈ విషయం తెలుసుకున్న వన్య తల్లిదండ్రులు పెళ్లిని తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ధనవంతుడైన తమ కుమారుడ్ని మోసం చేసి పెళ్లిచేసుకుందని అనీని నిందిస్తారు. తమ కుమారుడ్ని వదిలేస్తే పదివేల డాలర్లు బహుమతిగా ఇస్తామని ఆశచూపిస్తారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇద్దరు ప్రేమికుల జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందన్నదే ఈ సినిమా ఇతివృత్తం.
‘అనోరా’ చిత్రాన్ని 6 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో ఇండిపెండెంట్ ఫిల్మ్‌గా తెరకెక్కించారు. కేవలం 40 మంది యూనిట్ సభ్యులు నిర్మాణంలో పాలుపంచుకున్నారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 41 మిలియన్ డాలర్లు (దాదాపు 358) కోట్లు వసూలు చేసింది. ఎంతటి ఆధునిక సంపన్న దేశాలకు చెందిన కుటుంబాలైనా, వేశ్యను వారు చూసే దృష్టికోణం వక్రంగానే ఉంటుందని, వేశ్యలో దయార్ధ్ర హృదయాన్ని సాధారణ సమాజం ఏనాటికీ అర్థం చేసుకోలేదని, వృత్తికంటే వారి వ్యక్తిత్వాలకు గౌరవమివ్వాలనే అంతర్లీన సందేశంతో ‘అనోరా’ ప్రేక్షకుల్ని మెప్పించింది. ప్రథమార్ధమంతా బోల్డ్ రొమాంటిక్ సన్నివేశాలతో ఉండే ఈ సినిమా ద్వితీయార్ధ ంలో భావోద్వేగభరితంగా సాగుతుంది. హాస్యం, వ్యంగ్యం ద్వారానే చక్కటి సామాజిక సందేశాన్ని అందించే ప్రయత్నం చేశాడు దర్శకుడు సీన్ బేకర్.
ఒకే చిత్రానికి గాను నాలుగు అస్కార్ పురస్కారాలను దక్కించుకున్న దర్శకుడిగా సీన్ బేకర్ చరిత్ర సృష్టించారు. బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఎడిటింగ్, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే విభాగాల్లో ఆయన అవార్డులు గెలుచుకున్నారు. గతంలో ‘పారసైట్’ చిత్రానికిగాను దర్శకుడు బాంగ్ జూన్ హో సైతం నాలుగు పురస్కారాలను పొందారు. అయితే ‘పారాసైట్’ చిత్రం బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కేటగిరీలో దక్షిణ కొరియా తరపున అవార్డు దక్కించుకోవడంతో సాంకేతికంగా ఆ విభాగాన్ని లెక్కలోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలో సీన్ బేకర్ ఆస్కార్ అవార్డుల చరిత్రంలో అరుదైన ఘనతను సాధించారు. అమెరికాకు చెందిన సీన్ బేకర్ ఇండిపెండెంట్ ఫిల్మ్‌మేకర్‌గా పేరు పొందారు. పేదలు, సెక్స్ వర్కర్ల జీవితాలు ప్రధాన ఇతివృత్తంగా ఆయన సినిమాలు తీశారు. టేక్ అవుట్, స్టార్లెట్, టాంజెరైన్, ది ఫ్లోరిడా ప్రాజెక్ట్, రెడ్ రాకెట్ వంటి చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి.
ప్రియాంకచోప్రా నిర్మించిన ‘అనూజ’ చిత్రం లైవ్ యాక్షన్ షార్ట్‌ఫిల్మ్ కేటగిరీలో ఎంట్రీని దక్కించుకొని ఆశల్ని రేపింది. అయితే ఈ సినిమాకు నిరాశే మిగిలింది. ఆడమ్గ్రేవ్స్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా ప్రియాంక చోప్రాతో పాటు గునీత్ మోంగా, సుచిత్ర నిర్మించారు. సజ్దా పఠాన్, అనన్యా షాన్‌బాగ్, నగేష్ బోస్ల్సే ప్రధాన పాత్రధారులు. 29 నిమిషాల నిడివితో రూపొందించారు. న్యూఢిల్లీలోని బట్టల మిల్లులో తన సోదరితో కలిసి పనిచేసే అనూజ అనే బాలిక కథ ఇది. బోర్డింగ్ స్కూల్లో చదువుకోవాలని తపించే అనూజ సంకల్పాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించారు. లైవ్ యాక్షన్ షార్ట్‌ఫిల్మ్ కేటగిరీలో ‘ఐయామ్ నాట్ రోబో’ సినిమా అవార్డును కైవసం చేసుకుంది.
‘ది బ్రూటలిస్ట్’ చిత్రానికిగాను ఆడ్రియన్ నికోలస్ బ్రాడీ ఉత్తమ నటుడిగా ఆస్కార్ పురస్కారాన్ని అందుకున్నారు. ఆయనకిది రెండో ఆస్కార్ అవార్డు. గతంలో ‘ది పియానిస్ట్’ (2003) చిత్రానికిగాను ఆయన తొలిసారి ఆస్కార్ గెలుచుకున్నారు. నాజీల దురాగతాల నుంచి బయటపడి ఆమెరికాలో తన కలలను నెరవేర్చుకోవడానికి ఓ వ్యక్తి చేసే ప్రయాణం నేపథ్యంలో ‘ది బ్రూటలిస్ట్’ చిత్రాన్ని తెరకెక్కించారు. యుద్ధానంతరం వలస జీవుల బతుకు చిత్రం, వారి కుటుంబ సంఘర్షణల నేపథ్యంలో ఈ సినిమా ఆకట్టుకుంది. ఇక ‘అనోరా’ చిత్రంలో వేశ్య పాత్రలో నటించిన మైకీ మాడిసన్ రోస్‌బర్గ్ ఉత్తమ నటిగా పురస్కారాన్ని దక్కించుకుంది. లఘు చిత్రాల నటిగా కెరీర్‌ను ఆరంభించిన మైకీ మాడిసన్.. బెటర్ థింగ్స్, వన్స్ ఆప్ ఆన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్, స్క్రీమ్ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది.
ఉత్తమ చిత్రం: అనోరా
ఉత్తమ నటుడు: ఆడ్రియన్ నికోలస్ బ్రాడీ (ది బ్రూటలిస్ట్)
ఉత్తమ నటి: మైకీ మాడిసన్ రోజ్‌బర్గ్ (అనోరా)
ఉత్తమ దర్శకుడు: సీన్ బేకర్ (అనోరా)
ఉత్తమ సహాయ నటుడు: కీరన్ కల్కిస్ (దిరియల్ పెయిన్)
ఉత్తమ సహాయ నటి: జోసల్దానా (ఎమీలియా పెరెజ్)
ఉత్తమ ఛాయాగ్రహణం: లాల్ క్రాలే (ది బ్రూటలిస్ట్)
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే: సీన్ బేకర్ (అనోరా)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: పాల్ తేజ్‌వెల్ (విక్డ్)
ఉత్తమ మేకప్: ది సబ్‌స్టాన్స్
ఉత్తమ ఒరిజినల్ సాంగ్: ఎల్మాల్ (ఎమీలియా పెరెజ్)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: నాథన్ క్రౌలీ, లీ శాండల్స్ (విక్డ్)
బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్: డ్యూన్ పార్ట్-2
ఉత్తమ ఒరిజినల్ స్కోర్: డేనియల్ బ్లమ్‌బెర్గ్ (ది బ్రూటలిస్ట్)