Oscar Challagariga: దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ట్రిపుల్ ఆర్ సినిమాలో ‘నాటు నాటు’ పాట రాసి ఆస్కార్ అవార్డు పొందిన ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్‌పై తీసిన డాక్యుమెంటరీ ‘ఆస్కార్ చల్లగరిగ’ మరో ఘనత దక్కించుకుంది. సీనియర్ పాత్రికేయుడు చిల్కూరి సుశీల్ రావు స్వీయ దర్శక నిర్మాణంలో వచ్చిన ఈ డాక్యుమెంటరీ చిత్రం.. ఫ్రాన్స్ వేదికగా జరుగుతున్న కేన్స్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శనకు అర్హత సాధించింది. ఈ చిత్రోత్సవంలో ఆస్కార్ చల్లగరిగ నామినీగా షార్ట్ లిస్ట్ అయినట్టు సుశీల్ రావు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ చిత్రోత్సవంలో ఎంపికైన నాలుగు చిత్రాలలో ఆస్కార్ చల్లగరిగ కూడా ఒకటి కావడం గమనార్హం.
చంద్రబోస్ ఆస్కార్ అవార్డు గెలుచుకుని స్వగ్రామమైన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చల్లగరిగకు వచ్చినపుడు గ్రామస్థులు ఆయనకు స్వాగతం పలికారు. ఆ ఉరేగింపు, గ్రామంతో చంద్రబోస్‌కు ఉన్న అనుబంధం.. అక్కడ మట్టి మనుషులతో చంద్రబోస్ సాన్నిహిత్యం వంటి సున్నితమైన అంశాలను మేళవించి ఈ డాక్యుమెంటరీని రూపొందించినట్టు దర్శకనిర్మాత చిల్కూరి సుశీల్ రావు తెలిపారు. కేన్స్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు అమెరికా, జర్మనీ, కెనడా, బల్గేరియా, ఫ్రాన్స్, చైనా, ఆస్ట్రేలియా, స్వీడన్, స్పెయిన్ వంటి దేశాల నుంచి వచ్చిన చిత్రాల పోటీని తట్టుకుని ఆస్కార్ చల్లగరిగ షార్ట్ లిస్ట్ అవడం గమనార్హం.