Om Shanti Shanti Shantihi | మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘జయ జయ జయ జయహే’ చిత్రానికి తెలుగు రీమేక్‌గా వచ్చిన చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’ (Om Shanti Shanti Shantihi). ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సోషల్ కామెడీ డ్రామాను ఏఆర్ సంజీవ్ దర్శకత్వం వహించగా.. సృజన్ యారబోలు నిర్మించాడు. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో తాజాగా రివ్యూలో చూద్దాం.
కథ : గోదావరి జిల్లాకు చెందిన శాంతి (ఈషా రెబ్బా) చదువుకోవాలనే పట్టుదల ఉన్న అమ్మాయి. కానీ పరిస్థితుల ప్రభావంతో చదువు ఆపేసి, చేపల వ్యాపారి అయిన ఓంకార్ నాయుడు (తరుణ్ భాస్కర్)తో పెళ్లికి తలవంచుతుంది. పెళ్లయ్యాక భార్యను చదివిస్తానని మాటిచ్చిన ఓంకార్, తీరా పెళ్లి తర్వాత తన అసలు రంగు బయటపెడతాడు. చిన్న విషయానికే భార్యపై చేయి చేసుకోవడం, అహంకారంతో వేధించడం అతనికి అలవాటు. అయితే ఒకరోజు భర్త వేధింపులు భరించలేక శాంతి తిరగబడుతుంది. తనలోని ‘శక్తి’ని భర్తకు రుచి చూపిస్తుంది. ఆ తర్వాత వారిద్దరి మధ్య సాగిన పోరు, చివరకు ఆ దంపతుల జీవితం ఎటు తిరిగింది అనేదే ఈ సినిమా కథ.
విశ్లేషణ: గృహహింస అనే సీరియస్ పాయింట్‌ను కామెడీ కోణంలో చెప్పడమే ఈ సినిమా ప్రత్యేకత. దర్శకుడు ఏఆర్ సజీవ్ మూలకథను మార్చకుండా, గోదావరి నేటివిటీని జోడించడంలో సక్సెస్ అయ్యారు. సినిమా ప్రథమార్ధం గోదావరి యాస, సరదా సన్నివేశాలతో సాఫీగా సాగిపోతుంది. శాంతి ఎదురుతిరిగే ఇంటర్వెల్ సీన్ థియేటర్లో ఈలలు వేయిస్తుంది. అయితే, ద్వితీయార్ధంలో కథనం కొంత నెమ్మదించింది. మాతృకను ఇప్పటికే ఓటీటీలో చూసేసిన వారికి కొన్ని సన్నివేశాలు పునరావృతమైనట్లు అనిపిస్తాయి. కోర్ట్ రూమ్ డ్రామా ఆకట్టుకున్నా, క్లైమాక్స్ మాత్రం కాస్త హడావుడిగా ముగించేసినట్లు అనిపిస్తుంది. ఎమోషనల్ కనెక్టివిటీ మరికాస్త బలంగా ఉంటే సినిమా స్థాయి పెరిగేది.
నటీనటులు
చేపల వ్యాపారిగా, భార్య చేతిలో తన్నులు తినే అహంకారి అయిన భర్తగా తరుణ్ భాస్కర్ అద్భుతమైన నటన కనబరిచారు. ఆయన కామెడీ టైమింగ్ సినిమాకు పెద్ద అసెట్ అని చెప్పవచ్చు. శాంతి పాత్రలో ఈషా ఒదిగిపోయారు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లలో ఆమె పర్ఫార్మెన్స్ సర్ ప్రైజ్ చేస్తుంది. ఇక బ్రహ్మాజీ తన మార్కు మేనరిజమ్స్‌తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు.
సాంకేతికంగా : జె క్రిష్ సంగీతం కథకు తగ్గట్టుగా ఉంది. గోదావరి అందాలను కెమెరాలో బంధించిన తీరు బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్:
తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా నటన
గోదావరి బ్యాక్ డ్రాప్ & కామెడీ
గృహహింసపై ఇచ్చిన సందేశం
మైనస్ పాయింట్స్:
నెమ్మదించిన సెకండాఫ్
హడావుడి క్లైమాక్స్
ఒరిజినల్ చూసిన వారికి కొత్తదనం లేకపోవడం
చివరిగా: మలయాళ మ్యాజిక్ తెలుగులోనూ పండిందనే చెప్పాలి. ఒరిజినల్ చూడని వారికి ఇది ఇంకా బాగా నచ్చుతుంది.