2003 సంక్రాంతి కానుకగా వచ్చిన మహేశ్‌బాబు ‘ఒక్కడు’ సినిమా ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో తెలిసిందే. గుణశేఖర్ దర్శకత్వంలో ఎంఎస్‌రాజు నిర్మించిన ఈ చిత్రం అప్పటివరకూ ఉన్న చాలా రికార్డులను అధిగమించి, ఆ ఏడాది నంబర్ వన్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం రీరిలీజ్‌ల ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో.. ఈ నెల 26న ‘ఒక్కడు’ కూడా 4k వెర్షన్లో థియేటర్లలో సందడి చేయనున్నది.
రాధామాధవి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ సమర్పణలో రామకృష్ణ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు గుణశేఖర్ మాట్లాడుతూ ‘అన్ని జనరేషన్లకూ నచ్చే సినిమా ‘ఒక్కడు’. ఇప్పటికే ఎన్నోసార్లు విడుదలైన ఈ సినిమా ఇప్పుడు 4k వెర్షన్లో రావడం ఆనందంగా ఉంది. అందరితోపాటు నేనూ ఈ సినిమా చూసేందుకు ఆసక్తిగా ఉన్నా’ అన్నారు. భూమిక కథానాయికగా నటించిన ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, ముఖేష్‌రుషి కీలక పాత్రలు పోషించిన విషయం తెలిసిందే.