OG Movie Shows Canceled | అమెరికాలో ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి షాక్ తగిలింది. ఉత్తర అమెరికాలోని ప్రముఖ థియేటర్ చైన్ అయిన యార్క్ సినిమాస్ (YorkCinemas) ‘OG’ చిత్ర ప్రదర్శనలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయానికి కారణం కేవలం వ్యాపారపరమైన విభేదాలు మాత్రమే కాదని.. ఈ ఓజీ సినిమాను ప్రదర్శిస్తే ప్రజల భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని యాజమాన్యం తమ ప్రకటనలో పేర్కొంది. అలాగే యార్క్ సినిమాస్ విడుదల చేసిన ప్రకటనలో డిస్ట్రిబ్యూటర్లపై సంచలన ఆరోపణలు చేసింది.
OG సినిమా డిస్ట్రిబ్యూటర్లు వారికి సంబంధించిన కొన్ని రాజకీయ శక్తుల వల్ల తమ థియేటర్లలోని ప్రజల భద్రతకు ప్రమాదం పొంచి ఉందని యార్క్ సినిమాస్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కారణంగానే షోలను రద్దు చేయాల్సి వచ్చిందని పేర్కొంది. అలాగే భవిష్యత్తులో విడుదలయ్యే దక్షిణాసియా() సినిమాల ఆర్థిక విలువను పెంచేందుకు టికెట్ రేట్లను పెంచమని కొందరూ వ్యక్తులు ఒత్తిడి తెచ్చారని యార్క్ సినిమాస్ ఆరోపించింది. అయితే తాము అలాంటి అనైతిక పద్ధతులకు పాల్పడబోమని యార్క్ తేల్చి చెప్పింది. దక్షిణాసియా కమ్యూనిటీలో సామాజిక హోదా, రాజకీయ అనుబంధాల ఆధారంగా గొడవలు సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని తమ థియేటర్ల డిస్ట్రిబ్యూషన్ పద్ధతి అందరికీ సమాన అవకాశాలు కల్పించేలా ఉంటుందని యార్క్ సినిమాస్ ప్రకటనలో వివరించింది.
అంతేకాకుండా.. భారతదేశంలోని కొన్ని ఆన్లైన్ మీడియా సంస్థలలో తమ ఫైనాన్షియల్ ట్రాన్స్క్షన్ల గురించి డిస్ట్రిబ్యూటర్లు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని అలాంటి అవాస్తవాలను ఖండిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. షోలు రద్దు అయిన నేపథ్యంలో ఇప్పటికే టికెట్లు కొనుగోలు చేసిన వారికి పూర్తి డబ్బును వాపసు ఇస్తామని యార్క్ సినిమాస్ యాజమాన్యం వెల్లడించింది. థియేటర్ల వద్ద భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తమ ఉద్యోగులు, కస్టమర్ల శ్రేయస్సు కోసమే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. అయితే ఈ వివాదంపై OG చిత్ర బృందం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.
⚠️ Press Release (Safety)#YorkCinemas #TheyCallHimOG#OGMovie #Update pic.twitter.com/xoLCVV5oEU
— York Cinemas (@yorkcinemas) September 22, 2025