OG 2 | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ బాక్సాఫీస్ వద్ద భారీ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ చిత్రం విడుదలకు ముందే రికార్డు స్థాయి అంచనాలు సొంతం చేసుకోగా, విడుదల తర్వాత కూడా ఓపెనింగ్స్ విషయంలో కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది. రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన సినిమా కావడంతో అభిమానులు ఈ చిత్రాన్ని భారీగా ఆదరించారు. వసూళ్ల పరంగా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి కమర్షియల్ హిట్‌గా నిలిచినప్పటికీ, సినిమా కథ విషయంలో మాత్రం కొంతమంది ప్రేక్షకులు మిశ్రమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా తొలి భాగంలో కథ కంటే హీరో ఎలివేషన్స్, స్టైలిష్ యాక్షన్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వల్ల పూర్తి స్థాయి కథన అనుభూతి మిస్ అయిందనే అభిప్రాయం సినీ అభిమానుల్లో వినిపించింది.
అయితే ఇప్పుడు అందరి దృష్టి ‘ఓజీ’ ప్రీక్వెల్పై పడింది. తొలి భాగంలో మిగిలిపోయిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంతో పాటు, ప్రధాన పాత్ర నేపథ్యం, అతని ప్రయాణం, భావోద్వేగాలకు సంబంధించిన అంశాలను ప్రీక్వెల్‌లో మరింత బలంగా చూపించనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తొలి భాగానికి వచ్చిన స్పందనను విశ్లేషించిన దర్శకుడు సుజీత్, ఈసారి కథనంపైనే ప్రధానంగా దృష్టి పెట్టినట్లు సమాచారం. కేవలం స్టైలిష్ మేకింగ్, పవన్ కళ్యాణ్ ఎలివేషన్స్‌పైనే కాకుండా, బలమైన కథ, పటిష్టమైన స్క్రీన్‌ప్లే, భావోద్వేగాలకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారట.
పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్, సుజీత్ విజువల్ టేకింగ్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు వాటికి తోడు బలమైన కథ కూడా జతకావడంతో ప్రీక్వెల్పై అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ఈసారి అభిమానులు మాత్రమే కాదు, సాధారణ ప్రేక్షకులను కూడా పూర్తిస్థాయిలో మెప్పించే సినిమా అందించాలనే లక్ష్యంతో చిత్రబృందం ముందుకు వెళ్తోందని టాక్. అయితే ప్రీక్వెల్ కథ, నిర్మాణంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్తలతో ‘ఓజీ’ తదుపరి భాగంపై భారీ హైప్ నెలకొంది. కథ, ఎమోషన్, యాక్షన్ అన్నీ సమపాళ్లలో ఉంటే ఈసారి ‘ఓజీ’ బాక్సాఫీస్ వద్ద మరింత పెద్ద సంచలనం సృష్టించే అవకాశాలు ఉన్నాయని అభిమానులు భావిస్తున్నారు.