‘ఏమైంది ఈ వేళ’ ప్యూర్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్. రామ్‌చరణ్ ‘రచ్చ’ పక్కా మాస్ ఎంటర్టైనర్. కెరీర్ ప్రారంభంలోనే పొంతనలేని జానర్లతో సినిమాలు తీసి విజయాలు అందుకున్నారు దర్శకుడు సంపత్ నంది. ఆయన దర్శకత్వంలో వచ్చిన బెంగాల్ టైగర్, సిటీమార్ సినిమాలు కూడా మాస్‌ని మెప్పించాయి.
సంపత్ నంది దర్శకత్వపర్యవేక్షణలో వచ్చిన ఓటీటీ హిట్ ‘ఓదెల రైల్వే స్టేషన్’ ఓ మర్డర్ మిస్టరీ. దానికి సీక్వెల్‌గా రాబోతున్న ‘ఓదెల 2’ సూపర్ నాచురల్ థ్రిల్లర్. ఇవి కూడా పొంతన లేని జానర్లే. ‘ఓదెల2’కు కథ, కథనం, మాటలు, నిర్మాణం, దర్శకత్వపర్యవేక్షణ బాధ్యతల్ని సంపత్ నంది నిర్వహించారు. ఈ నెల 18న ‘ఓదెల 2’ విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో ముచ్చటించారు.
అసలు ‘ఓదెల రైల్వేస్టేషన్’ చేసేటప్పుడు ఆ కథకు సీక్వెల్ చేయాలనే ఆలోచన లేదు. కథ డిమాండ్ చేయడంతో తెలీకుండానే సీక్వెల్‌కి లీడ్ ఇచ్చాను. ఆ సినిమా ఓటీటీలో మంచి హిట్. ఆ సినిమా చూసిన వారూ, దానికి పనిచేసినవారూ.. ఇలా చాలామంది సీక్వెల్ రాయొచ్చుగా అని అడిగేవాళ్లు. ఓసారి భీమ్స్‌తో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్‌కి వెళ్లాను. వెళ్లిన పని అవ్వలేదుకానీ.. ఈ సీక్వెల్ పాయింట్ మాత్రం అక్కడే పుట్టింది. ఫస్ట్‌పార్ట్‌లో ఒక దుష్టశక్తి అంతం అవుతుంది. దాని ఆత్మని కంట్రోల్ చేయడానికి మరో శక్తి కావాలి. ఆ శక్తి శివశక్తి అయితే ఎలా ఉంటుంది? అనే ఆలోచన వచ్చింది. అప్పుడు నా మనసులో మెదిలిన రూపం తమన్నా. ఆమెతో ఇప్పటికే రెండు సినిమాలు చేశాను. మంచి యాక్టర్ ఈ పాత్ర బాగా చేయగలదు అనిపించింది. కథ తనకు కూడా నచ్చింది. అలా ‘ఓదెల2’ పట్టాలెక్కింది.