Odela 2 | సూపర్ నాచురల్ థ్రిల్లర్ ‘ఓదెల రైల్వే స్టేషన్’ సినిమాకు సీక్వెల్‌గా, తమన్నా భాటియా ప్రధాన పాత్రలో ‘ఓదెల-2’ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో తమన్నా నాగసాధువుగా మిస్టరీ ఎనర్జీతో కూడిన పాత్ర పోషిస్తున్నది. సంపత్‌నంది రచనా, దర్శకత్వ పర్యవేక్షణలో అశోక్ తేజా దర్శకత్వంలో డి.మధు నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్‌ని శనివారం ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభమేళాలో, త్రివేణి సంగమం వద్ద నాగసాధువుల సమక్షంలో ఆవిష్కరించారు.
ఓ రాక్షస శక్తి తిరిగి రావడం నుంచి కథ మొదలవుతుందని, దాని మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని ప్రపంచాన్ని కల్లోలం చేయడానికి నిశ్చయించుకున్న ఆ రాక్షస శక్తిని తమన్నా భాటియా పోషించిన నాగసాధు పాత్ర ఎదుర్కొంటుందని మేకర్స్ తెలిపారు. అన్ని విధాలుగా ఈ సినిమా నెక్ట్స్ లెవల్లో ఉంటుందని, తమన్నా పాత్ర హైలైట్‌గా నిలుస్తుందని వారు పేర్కొన్నారు. మహాకుంభమేళా మాదిరిగా ‘ఓదెల2’ లాంటి సినిమా చేసే అవకాశం కూడా జీవితానికి ఒకసారే వస్తుందని, సాంకేతికంగా ఈ సినిమా ఓ అద్భుతమని తమన్నా చెప్పారు.
కథని నమ్మి చేస్తున్న సినిమా ఇదని, ఇందులోని విజువల్స్ ఆడియన్స్‌ని రోమాంచితం చేస్తాయని, ‘అమ్మోరు’ చూసి సౌందర్యనీ, ‘అరుంధతి’ని చూసి అనుష్కను ఎంతలా ఆరాధించామో.. ఈ సినిమా తర్వాత తమన్నాను అంత ఆరాధిస్తారని, మాంసాహారానికి దూరంగా ఉంటూ, కఠోరమైన నియమనిష్టలతో తమన్నా ఈ పాత్ర చేశారని సంపత్ నంది తెలిపారు. ఇంకా చిత్ర యూనిట్ మొత్తం మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: సౌందర్ రాజన్ ఎస్., సంగీతం: అజనీష్ లోక్‌నాథ్, నిర్మాణం: మధు క్రియేషన్స్, సంపత్‌నంది టీమ్ వర్క్స్.