OctoberBoxOffice | టాలీవుడ్ పరిశ్రమకు పండగల సీజన్ ఎప్పుడూ కలిసొచ్చే అంశమే అన్న విషయం తెలిసిందే. అందుకే అక్టోబర్‌లో దసరా, దీపావళి పండుగల సందర్భంగా విడుదలైన పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. నెల మొత్తం మీద తక్కువ సినిమాలు రిలీజైనప్పటికీ ఇందులో మూడు, నాలుగు సినిమాలు మాత్రమే విజయం సాధించడం విశేషం.
1. కాంతార చాప్టర్-1
ఓజీ ఎఫెక్ట్‌తో అక్టోబర్ తొలి వారం స్ట్రైట్ సినిమాల సందడి లేకపోయినా, డబ్బింగ్ సినిమాలు మాత్రం దృష్టిని ఆకర్షించాయి. ధనుష్ నటించిన ‘ఇడ్లీ కొట్టు’ ఫ్లాప్ కాగా, రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన ‘కాంతార చాప్టర్-1’ అంచనాలకు మించి ఘన విజయాన్ని అందుకుంది. ప్రారంభంలో మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ, సెకెండాఫ్ అద్భుతంగా క్లిక్ అవ్వడంతో సినిమాకు కలెక్షన్లలో ఎదురులేకుండా పోయింది. ఒకానొక దశలో ‘ఓజీ’కి కేటాయించిన థియేటర్లు కూడా ‘కాంతార’కు దక్కాయి. ఏకంగా రూ. 850 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించి, ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది ఈ కల్ట్ క్లాసిక్.
2.అరి
‘కాంతార’ విజయంతో అక్టోబర్ బాక్సాఫీస్ జోరుగా మొదలైనా, రెండో వారం ఆ ఊపు కనిపించలేదు. ఈ వారం విడుదలైన ‘శశివదనే’, ‘కానిస్టేబుల్స, ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోగా.. చిన్న చిత్రంగా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. అర్వీ సినిమాస్ బ్యానర్‌పై రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి సమర్పణలో నిర్మితమైన ‘అరి’ చిత్రం ఏషియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘పేపర్ బాయ్’ ఫేమ్ దర్శకుడు జయశంకర్ రూపొందించిన ఈ సినిమాలో వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటించారు. అరిషడ్వర్గాల (కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం) ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా సూపర్ హిట్ విజయాన్ని నమోదు చేసింది.
మూడో వారం దీపావళి సీజన్‌తో ఏకంగా నాలుగు సినిమాలు బాక్సాఫీస్ పోటీలో నిలిచాయి. వీటిలో రెండు సినిమాలు క్లిక్ అయ్యాయి.
కె-ర్యాంప్
కిరణ్ అబ్బవరం నటించిన ఈ చిత్రం దీపావళి విన్నర్‌గా నిలిచింది. తొలి రోజు మిక్స్డ్ టాక్ వచ్చినా, రెండో రోజు నుంచి అనూహ్యంగా పుంజుకుంది. కిరణ్ చేసిన ప్రచారం సినిమాకు బాగా కలిసొచ్చింది.
డ్యూడ్
యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన ఈ సినిమాకు యూత్‌లో మంచి క్రేజ్ కనిపించింది. మొదటి రోజు, మొదటి వారాంతంలో వసూళ్లు ఆశించిన స్థాయిలో నమోదయ్యాయి. ఓవరాల్‌గా రూ. 100 కోట్ల వసూళ్లను దాటి ఈ చిత్రం సక్సెస్ అనిపించుకుంది.
‘తెలుసు కదా’ నిరాశ: సిద్ధు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన ‘తెలుసు కదా’ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద షాకిచ్చింది. క్లారిటీతో మొదలై కన్ఫ్యూజింగ్గా ముగియడం, బలహీనమైన సన్నివేశాల కారణంగా ఇది సిద్ధు కెరీర్లో బలహీనమైన చిత్రంగా నిలిచింది.
‘మిత్రమండలి’: ఈ ఫెస్టివల్ సీజన్లో వచ్చిన ఈ కామెడీ చిత్రం ఆశించిన స్థాయిలో నవ్వులు పూయించలేకపోయింది.
చివరి వారంలో ‘బైసన్’, ‘ధర్మవరం’ లాంటి సినిమాలు వచ్చినా, అంతకుముందు వచ్చిన ‘కె-ర్యాంప్’, ‘డూడ్’ సినిమాల హవానే కొనసాగింది. ఈ మధ్యలో వచ్చిన రష్మిక నటించిన ‘థామా’ కూడా తెలుగులో మూడు రోజుల ముచ్చటగానే మిగిలింది.