Nushrratt Bharuccha | బాలీవుడ్ నటి నుష్రత్ బరుచా తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నది. 2019లో వచ్చిన ‘డ్రీమ్ గర్ల్’ సినిమా ఈ బాలీవుడ్ భామకు గుర్తింపు తెచ్చిపెట్టింది. అదే టీమ్ ఆ సినిమాకి సీక్వెల్‌గా 2023లో ‘డ్రీమ్‌గర్ల్ 2’ను తెరకెక్కించారు. తొలిపార్ట్‌లో నటించిన వారంతా ఈ సీక్వెల్లోనూ నటించారు. ఒక్క నుష్రత్ బరుచా తప్ప.
ఇది తన జీవితంలో ఎదురైన చేదు అనుభవంగా ఆమె అభివర్ణించారు. దీనిపై ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘ మా టీమ్ నిర్ణయం నన్నెంతో బాధించింది. ‘డ్రీమ్ గర్ల్’లో నటించిన అందర్నీ సీక్వెల్లో తీసుకున్నారు.. నన్ను తప్ప. నా బదులు అనన్య పాండేను తీసుకున్నారు. ఈ విషయాన్నే జీర్ణించుకోలేకపోయా. అలా అని నేనేం యుద్ధానికి దిగలేదు. ఎందుకంటే పోరాటం చేసినంత మాత్రాన పరిస్థితులు మారవు. ఒకవేళ నిలదీస్తే.. ‘నువ్వు అవసరం లేదు’ అనే సమాధానం వస్తే.. ఇక ఆ బాధ వర్ణనాతీతం. అయినా అది వారి సినిమా. వారి ఇష్టం. అందుకే ప్రశ్నించలేదు.’ అంటూ వాపోయింది నుష్రత్.