Nupur Sanon | బాలీవుడ్ అగ్ర హీరోయిన్ కృతి సనన్ సోదరిగా ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్న నూపుర్ సనోన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కృతి స్టార్ హీరోయిన్గా దూసుకుపోతుండగా, నూపుర్ మోడల్‌గా, నటిగా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకునే ప్రయత్నం చేసింది. అయితే నటిగా కృతి స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయినా, సోషల్ మీడియా, మ్యూజిక్ వీడియోల ద్వారా నూపుర్ మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఇటీవల నూపుర్ సనోన్ ప్రముఖ గాయకుడు స్టెబిన్ బెన్‌తో డేటింగ్లో ఉందన్న వార్తలు బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి. కొంతకాలంగా వీరిద్దరూ కలిసి కనిపించడంతో పాటు, సోషల్ మీడియాలో కూడా పరోక్ష సంకేతాలు ఇవ్వడంతో ఈ జంటపై పెళ్లి రూమర్స్ జోరుగా వినిపించాయి. తాజాగా ఆ పుకార్లకు బలం చేకూరేలా జాతీయ మీడియా వర్గాలు కీలక సమాచారం బయటపెట్టాయి.
తాజా కథనాల ప్రకారం, నూపుర్ సనోన్ – స్టెబిన్ బెన్ జంట త్వరలోనే వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారట. జనవరి 11న రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం. జనవరి 9 నుంచి 11 వరకు ప్రీ-వెడ్డింగ్ వేడుకలు జరగనున్నాయని, జనవరి 11న తాళి కట్టే ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. మూడు రోజుల పాటు సాగే ఈ వివాహ వేడుకలు పూర్తిగా కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగే ప్రైవేట్ కార్యక్రమంగా ఉండనున్నాయని చెబుతున్నారు. పెళ్లి వేడుకలు సింపుల్‌గా, వ్యక్తిగతంగా నిర్వహించాలన్నదే నూపుర్- స్టెబిన్ నిర్ణయమని సమాచారం. పరిశ్రమ నుంచి కూడా చాలా పరిమిత సంఖ్యలో సన్నిహితులు మాత్రమే హాజరుకానున్నారు. ఉదయపూర్‌లో జరిగే ఈ వివాహ వేడుకలకు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉంటాయని తెలుస్తోంది.
వివాహానంతరం ఈ జంట ముంబైలో ప్రత్యేకంగా ఒక గ్రాండ్ రిసెప్షన్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. జనవరి 13న జరగనున్న ఈ విందుకు బాలీవుడ్ ప్రముఖులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని టాక్ వినిపిస్తోంది. ముంబై రిసెప్షన్తోనే నూపుర్ – స్టెబిన్ తమ వివాహాన్ని అధికారికంగా ఇండస్ట్రీకి పరిచయం చేయనున్నారని అంటున్నారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో స్టెబిన్ బెన్ తన సంబంధం గురించి భిన్నంగా స్పందించారు. తాను ఇంకా ఒంటరిగా ఉన్నానని, నెలలో 25 రోజులు ప్రయాణాల్లోనే గడుస్తుండడంతో వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టే అవకాశం లేదని ఆయన వ్యాఖ్యానించారు. అదే సమయంలో నూపుర్ గురించి మాట్లాడుతూ, “మాకు అద్భుతమైన అనుబంధం ఉంది. మేము చాలా సన్నిహితంగా ఉంటాం. ఆమెతో చాలా సమయం గడిపాను. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు” అని చెప్పుకొచ్చారు.