Actress |సినీ ప్రపంచంలో వెలుగులు విరజిమ్ముతూ, కీర్తి కురిపించే ప్రశంసల వెనుక ఎన్ని బాధలున్నాయో చాలా మందికి తెలియదు. ఒకప్పుడు చిన్నా పెద్దా తెరపై ఓ వెలిగిన నటి నుపుర్ అలంకార్‌కు ఇప్పుడు తిండి కూడా దొరకడం కష్టమైంది. 150కి పైగా సీరియల్స్‌లో నటించి స్టార్డమ్ అందుకున్న ఈ నటి ప్రస్తుతం గుహల్లో నివసిస్తూ, భిక్షాటనతో జీవనం సాగిస్తున్నారు. నుపుర్ అలంకార్‌ని బాలీవుడ్, హిందీ టెలివిజన్ ప్రేక్షకులు ఇట్టే గుర్తుపడతారు. శక్తిమాన్, ఘర్ కీ లక్ష్మీ బేటియాన్, దియా ఔర్ బాటి హమ్ వంటి ప్రముఖ సీరియల్స్‌లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ నటనా ప్రయాణం తర్వాత ఆమె జీవితంలో విపరీతమైన మార్పులు చోటుచేసుకున్నాయి.
2019లో జరిగిన పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో ఆపరేటివ్ బ్యాంక్ (PMC) కుంభకోణం నుపుర్ జీవితాన్ని తలకిందులు చేసింది. తన తల్లి వైద్య చికిత్స కోసం దాచిన డబ్బు ఈ బ్యాంకులోనే ఉండడంతో ఆంక్షల కారణంగా ఆమె విత్‌డ్రా చేయలేకపోయింది. ఈ సమయంలో తల్లి, సోదరి మరణాలు ఆమెను మరింత కృంగదీశాయి. “నా జీవితమే ముగిసిపోయిందనుకున్నా,” అని ఆమె కన్నీళ్లతో మీడియాకు వెల్లడించారు. జీవితంలో తగిలిన దెబ్బలు, ఆత్మీయుల మృతులు చూసి విరక్తి చెందిన నుపుర్ 2022లో నటనకు వీడ్కోలు పలికారు. ఆధ్యాత్మిక జీవితం ప్రారంభించి, తన పేరును ‘పీతాంబర మా’ మార్చుకున్నారు. అప్పటి నుంచి దేశంలోని పర్వతాలు, అడవులు, ఆశ్రమాలను సందర్శిస్తూ సన్యాస జీవితం కొనసాగిస్తున్నారు.
గత మూడేళ్లుగా ఆమె గుహల్లో, అడవుల్లో నివసిస్తున్నారు. కొన్ని ప్రదేశాల్లో విషపూరిత కీటకాలు, ఎలుకలు ఆమెను గాయపరిచాయి. చలికి గడ్డకట్టే ప్రాంతాల్లో సంచరించడం వల్ల అనారోగ్యం బారిన పడ్డా కూడా, నుపుర్ తన ఆధ్యాత్మిక మార్గాన్ని వదల్లేదు. ప్రస్తుతం కొన్ని బట్టలతోనే జీవిస్తూ, భిక్షాటన ద్వారా తిండి సంపాదిస్తున్నారు. ఒకప్పుడు విలాసవంతమైన జీవితం గడిపిన నుపుర్ ఇప్పుడు నిరాడంబరతకు మార్గదర్శకంగా నిలుస్తున్నారు. డబ్బు, ఖ్యాతి తాత్కాలికమని, అంతిమంగా మనశ్శాంతి మాత్రమే ముఖ్యం అని ఆమె చెబుతున్నారు. “పేరు, డబ్బు కోసం పాకులాడొద్దు. నిజమైన ఆనందం మన లోపలే ఉంటుంది” అని నుపుర్ సందేశం ఇస్తున్నారు.