NTR | యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరుతో కొన్ని అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తున్న ఘటనలపై ఆయన కార్యాలయం తాజాగా కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ తరహా కార్యకలాపాలు తమ దృష్టికి వచ్చినట్లు వెల్లడించిన ఎన్టీఆర్ టీమ్, వాటితో నటుడికి గానీ, ఆయన అధికారిక కార్యాలయానికి గానీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియా, ఫ్యాన్ గ్రూపులు, వాట్సాప్ కమ్యూనిటీల ద్వారా ఎన్టీఆర్ పేరును ఉపయోగిస్తూ కొందరు వ్యక్తులు సేవా కార్యక్రమాల పేరుతో డబ్బులు సేకరిస్తున్నారని సమాచారం అందుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన విడుదలైనట్లు తెలుస్తోంది.
అభిమానుల అభిమానం, ప్రజల విశ్వాసాన్ని ఆసరాగా చేసుకుని కొందరు మోసాలకు పాల్పడే అవకాశం ఉందని కార్యాలయం హెచ్చరించింది. ఎన్టీఆర్ అనుమతి లేకుండా ఆయన పేరు, ఫోటోలు లేదా ఫ్యాన్ బేస్‌ను ఉపయోగించి చేపడుతున్న వ్యక్తిగత కార్యక్రమాలకు ఎవరూ విరాళాలు ఇవ్వవద్దని ప్రజలను, అభిమానులను విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో ఎన్టీఆర్ తరఫున ఎలాంటి సేవా కార్యక్రమాలు, చారిటీ ఈవెంట్లు లేదా సహాయ కార్యక్రమాలు నిర్వహించినా అవి పూర్తిగా అధికారిక సోషల్ మీడియా ఖాతాలు లేదా ఆయన కార్యాలయం ద్వారానే ప్రకటించబడతాయని స్పష్టం చేశారు.
నకిలీ విరాళాల సేకరణ పేరుతో మోసాలు జరిగే అవకాశం ఉన్నందున అభిమానులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరికైనా అనుమానాస్పదంగా కనిపించే విరాళాల సేకరణ కార్యక్రమాలు గమనించినట్లయితే వెంటనే అధికారులకు లేదా ఎన్టీఆర్ అధికారిక బృందానికి సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అభిమానులు కూడా ఇటువంటి మోసాలపై జాగ్రత్తగా ఉండాలని ఒకరికి ఒకరు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస భారీ సినిమాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో ఆయన పేరును ఉపయోగించి కొందరు దుర్వినియోగానికి పాల్పడటంపై అభిమానుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.