NTR | మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ , స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న డ్రాగన్‌పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ న్యూ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. తాజాగా బయటకు వచ్చిన లుక్‌లో ఎన్టీఆర్ కండలు తిరిగిన దేహంతో, బీస్ట్ మోడ్‌లో కనిపిస్తున్నారు. సన్నని నడుముతో క్లాసిక్ బ్యాక్ డబుల్ బైసెప్స్ పోజ్‌లో ఆయన ట్రాన్స్ఫర్మేషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పవర్ఫుల్ యాక్షన్ పాత్ర కోసం ఎన్టీఆర్ కఠినమైన ట్రైనింగ్, ప్రత్యేక డైట్‌ను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. జిమ్‌లో ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోను షేర్ చేస్తూ “Built… Not Bought” అని ఆయన రాసిన క్యాప్షన్ కూడా వైరల్ అవుతోంది.
ఇటీవల ఎన్టీఆర్ లుక్‌పై కొంత అసంతృప్తి ఏర్పడిందని, దాని వలన షూటింగ్ నిలిచిపోయిందంటూ ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే దీనిపై చిత్ర నిర్మాతలు స్పష్టత ఇచ్చారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ఇది కేవలం రెగ్యులర్ షెడ్యూల్ బ్రేక్ మాత్రమేనని తెలిపారు. ప్రస్తుతం షూటింగ్ అనుకున్న ప్రణాళిక ప్రకారమే కొనసాగుతోందని పేర్కొన్నారు. ఇప్పటికే జోర్డాన్‌లో ఒక షెడ్యూల్ పూర్తయినట్లు సమాచారం. అలాగే హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ ప్రాంతంలో కూడా కీలక సన్నివేశాలు చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఎన్టీఆర్‌పై యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరించారని సమాచారం. తదుపరి షెడ్యూల్ కోసం భారీ సెట్స్ నిర్మాణం జరుగుతోంది.
ఈ సినిమాలో విలన్ పాత్రపై కూడా ఆసక్తికర చర్చ నడుస్తోంది. తొలుత మలయాళ నటుడు టోవినో థామస్ ఈ పాత్రలో నటిస్తారని ప్రచారం జరిగింది. కానీ డేట్స్ సమస్యల కారణంగా ఆయన ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ కీలక పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్‌ని సంప్రదించే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ఇండస్ట్రీ టాక్ వినిపిస్తోంది. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో హీరోయిన్గా రుక్మిణి వసంత్ నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలో రానున్నాయి. జూన్ 25న విడుదల చేయాలనే ప్రణాళికలో ఉన్నట్లు సమాచారం.