NTR |ఆగస్ట్ 14న బాక్సాఫీస్ వద్ద మాస్ క్లాష్ జరగనుంది. రెండు పెద్ద సినిమాల మధ్య జరగనున్నఈ ఫైట్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్ – జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ‘వార్ 2’ చిత్రం, సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో వస్తున్న ‘కూలీ’ చిత్రం ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఒకే రోజు రిలీజ్ కానుండడంతో బాక్సాఫీస్ వార్ ఎలా ఉంటుందా అని ఇప్పటి నుండే లెక్కలు వేస్తున్నారు. అయితే రెండు చిత్రాల విడుదలకు ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రెండు సినిమాలకు అదనపు షో ప్రదర్శించేందుకు అనుమతి ఇచ్చింది. దీనితో పాటు, టికెట్ ధరలను పెంచుకునేందుకు కూడా జీవో జారీ చేసింది.
మంగళవారం సాయంత్రం ‘కూలీ’ చిత్రానికి టికెట్ ధరల పెంపు పై అధికారిక సమాచారం రావడంతో ‘వార్ 2’ అభిమానుల్లో కాస్త టెన్షన్ ఏర్పడింది. కానీ వెంటనే ‘వార్ 2’ చిత్రానికి కూడా అదే విధంగా అనుమతులు రావడంతో తారక్ ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుష్ అయ్యారు. ఇక ఏపీ ప్రభుత్వం ఇచ్చిన సపోర్ట్ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. “వార్ 2 విడుదల సందర్భంగా టికెట్ ధరలు పెంచుకునే అవకాశం కల్పించినందుకు గౌరవనీయులైన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు” అంటూ కృతజ్ఞతలు తెలిపారు.
‘వార్ 2’ హంగామా అంతగా కనిపించడం లేదు అనుకుంటున్న సమయంలో ప్రీ-రిలీజ్ ఈవెంట్లో తన స్టైల్ చూపించి అభిమానులను ఉర్రూతలూగించారు జూనియర్ . తను కాలర్ ఎగరేయడంతో పాటు, హృతిక్ రోషన్‌తో కూడా కాలర్ ఎగరవేసేలా చేశారు. ఇది ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఎందుకంటే, గతంలో ఎన్టీఆర్ కాలర్ ఎగరేసిన సినిమాలు బ్లాక్‌బస్టర్ అయ్యాయని ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్ కూడా ఉంది. యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌కు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. హృతిక్ రోషన్ సరసన కియారా అద్వానీ నటించగా, జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్రలో అలరించనున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు విశేష స్పందన లభించింది. యాక్షన్ సీన్స్ థియేటర్లను హిట్టెక్కించబోతున్నాయని సినిమా యూనిట్ ధీమాగా చెబుతోంది. “ఎన్టీఆర్ నటనలో ఉన్న ఎమోషన్‌ను దృష్టిలో పెట్టుకునే అతన్ని తీసుకున్నాం,” అని దర్శకుడు వెల్లడించారు.