‘దేవర’ చిత్రం జపాన్‌లో నేడు ప్రేక్షకుల ముందుకొస్తున్నది. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల కోసం కొద్దిరోజుల క్రితం జపాన్ వెళ్లిన చిత్ర కథానాయకుడు ఎన్టీఆర్ అక్కడ బిజీబిజీగా గడుపుతున్నారు. జపాన్‌లోని వివిధ నగరాల్లో నిర్వహిస్తున్న ప్రమోషనల్ ఈవెంట్స్‌లో ఆయన పాల్గొంటున్నారు. అభిమానులతో సెల్ఫీలు దిగుతూ, వారికి ఆటోగ్రాఫ్‌లు ఇస్తున్న ఎన్టీఆర్ ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా జపాన్‌లోని ఓ అభిమాని చెప్పిన మాటలు తన హృదయాన్ని కదిలించాయని ఎన్టీఆర్ తన సోషల్‌మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు.
ఆర్ఆర్ఆర్ సినిమా చూశాక తాను తెలుగు నేర్చుకుంటున్నానని ఓ అభిమాని తనతో చెప్పడం గొప్ప సంతోషాన్నిచ్చిందని ఎన్టీఆర్ పేర్కొన్నారు. ‘సినిమా భిన్న సంస్కృతుల మధ్య వారధిగా నిలుస్తూ ఓ అభిమానిని తెలుగు నేర్చుకునేలా స్ఫూర్తిని కలిగించడం చాలా గొప్ప విషయం. సమకాలీన భారతీయ సినిమా విశ్వవ్యాప్తం కావడం అమితానందాన్ని కలిగిస్తున్నది’ అని ఎన్టీఆర్ తన పోస్ట్‌లో వెల్లడించారు. ఇటీవలే ఎన్టీఆర్ హిందీ ‘వార్-2’ షూటింగ్‌ను పూర్తి చేశారు. ప్రస్తుతం ప్రశాంత్‌నీల్ డైరెక్షన్లో రూపొందుతున్న సినిమా కోసం సిద్ధమవుతున్నారు.