Dragon | ప్రస్తుతం ఎన్టీఆర్ అభిమానులందరి దృష్టి ప్రశాంత్‌నీల్‌తో చేయబోయే సినిమాపైనే ఉంది. ఆ సినిమా అప్డేట్లకోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్ దాదాపుగా ఖరారైందని టాక్. ప్రస్తుతం తారక్ ‘వార్2’ షూటింగ్‌ను ముగించే పనిలో ఉన్నారు. ఆ సినిమా తర్వాత వెంటనే ఈ సినిమా సెట్స్‌లోకి ఆయన ఎంట్రీ ఇస్తారు. ఈ నెల చివర్లోగానీ, వచ్చే నెల ప్రథమార్ధంలో గానీ ఈ సినిమా సెట్స్‌కి వెళ్లొచ్చని సమాచారం. ఇదిలావుంటే.. ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో హల్చల్ చేస్తుంది.
కథ రీత్యా ఇందులో ఓ కీలకమైన పాత్ర ఉందట. ఆ పాత్రకు మలయాళ అగ్ర నటుడు టోవినో థామస్‌ను ఎంపిక చేసినట్టు సమాచారం. మలయాళంలో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన టోవినో.. ‘2018’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువయ్యారు. మరి ‘డ్రాగన్’లో ఆయన నటిస్తున్న మాట నిజమేనా? ఒకవేళ నిజమైతే అది ఏ తరహా పాత్ర? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే.. ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.