Dragon | యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న ఆ క్రేజీ అప్డేట్ ఎట్టకేలకు వచ్చేసింది. ‘కేజీయఫ్’, ‘సలార్’ చిత్రాలతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్, తారక్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ (NTRNeel) టైటిల్‌ను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ పవర్ఫుల్ ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా ఈ చిత్రానికి ‘డ్రాగన్’ (Dragon) అనే పవర్ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. మే 19 అర్ధరాత్రి తారక్ బర్త్‌డేకి కొన్ని నిమిషాల ముందే విడుదలైన ఈ గ్లింప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ప్రశాంత్ నీల్ తన మార్క్ డార్క్ థీమ్‌తో ఏకంగా 4 నిమిషాల 28 సెకండ్ల నిడివితో ఒక భారీ విజువల్ వండర్‌ను ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈ గ్లింప్స్ వీడియో 1967 నాటి అంతర్జాతీయ ఓపియం (నల్లమందు Opium Trade) బ్యాక్‌డ్రాప్‌లో, గోల్డెన్ ట్రయాంగిల్ నేపథ్యంలో సాగే ఒక క్రూరమైన, హింసాత్మకమైన చీకటి ప్రపంచాన్ని కళ్లకు కట్టింది. ఇందులో హీరోయిన్ రుక్మిణి వసంత్ వాయిస్ ఓవర్‌తో కథా నేపథ్యాన్ని, అందులోని పాత్రలను పరిచయం చేస్తూ చివరగా అసలైన ‘డెవిల్’ను ఎంట్రీ చేయించారు. అఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీకి ‘చీఫ్ అసస్సిన్’ (ప్రధాన హంతకుడు) అయిన ‘లూగర్'(Luger) అనే అత్యంత భయంకరమైన పాత్రలో ఎన్టీఆర్ లుక్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంది.
ఈ గ్లింప్స్‌లో ఎన్టీఆర్ రఫ్ అండ్ లీన్ లుక్, గంభీరమైన కళ్లు అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నాయి. ముఖ్యంగా ఒక సీన్ లో శవాల దిబ్బపై నిలబడి ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ థియేటర్లలో విసిల్ వర్తీగా నిలవడం ఖాయం. ‘దేవుడు నాకో గొప్ప వరం ఇచ్చాడు.. ట్రిగ్గర్ నొక్కగానే మర్చిపోవడం’ అంటూ తారక్ బేస్ వాయిస్‌తో చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ప్రశాంత్ నీల్ సృష్టించిన ఈ సరికొత్త ప్రపంచంలో ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ మునుపెన్నడూ చూడని విధంగా, ఒక ఊరమాస్ బీస్ట్ మోడ్‌లో ఉంది.
ఈ భారీ యాక్షన్ డ్రామాలో బాలీవుడ్ ఎవర్ గ్రీన్ స్టార్ అనిల్ కపూర్ ఇండియన్ నార్కోటిక్స్ బ్యూరో చీఫ్ ‘రఘువీర్ రాథోడ్’గా ఒక పవర్ఫుల్ రోల్లో కనిపిస్తుండగా, బిజు మీనన్, ఖుష్బూ సుందర్, అశుతోష్ రాణా, గురు సోమసుందరం, రాజీవ్ కనకాల వంటి భారీ తారాగణం నటిస్తున్నారు. రవి బస్రూర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) మరియు భువన్ గౌడ విజువల్స్ ఈ గ్లింప్స్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం 5 భాషల్లో ప్రపంచవ్యాప్తంగా జూన్ 11, 2027న థియేటర్లలోకి రానుంది. ఈ గ్లింప్స్ దెబ్బకు తారక్ అభిమానులకు ‘సింహాద్రి’ రోజుల నాటి మాస్ వైబ్స్ మళ్లీ గుర్తొస్తున్నాయని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.