Jr NTR | ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి నేరుగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘వార్ 2’. హృతిక్ రోషన్‌తో కలిసి ఆయన నటిస్తున్న ఈ మల్టీస్టారర్ వచ్చే ఏడాది ఆగస్ట్ 14న విడుదల కానుంది. ఇందులో ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉండబోతున్నది అనే విషయంపై దక్షిణాది ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొని ఉంది. తాజాగా ఇందులో తారక్ ఇంట్రడక్షన్ సీన్ గురించి బీ టౌన్లో ఓ ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతున్నది.
వివరాల్లోకెళ్తే.. పైరేట్ తరహా థీమ్‌తో తారక్ ఇంట్రడక్షన్ సీన్‌ని దర్శకుడు అయాన్ ముఖర్జీ ప్లాన్ చేశారట. ఈ సీన్లో యాక్షన్ డోస్ కూడా భారీగా ఉంటుందని తెలుస్తున్నది. తారక్ చేసే ఫైట్స్ హాలీవుడ్ స్థాయిలో ఆడియన్స్‌ని ఆశ్చర్యానికి గురిచేసేలా ఉంటాయట. అలాగే.. హృతిక్‌ని ఎదుర్కొనే సన్నివేశాలు కూడా గూజ్బంప్స్ తెప్పిస్తాయని తెలుస్తున్నది. యశ్‌రాజ్ సంస్థ ఇప్పటివరకూ నిర్మించిన స్పై యూనివర్స్‌లో ‘వార్ 2’ స్పెషల్‌గా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు.