ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమాకు రంగం సిద్ధమవుతున్నది. అగ్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఇంకా అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ.. ఈ సినిమా తాలూకు పూర్వ నిర్మాణ కార్యక్రమాలను వేగవంతం చేశారని తెలిసింది. హిందూ ధర్మంలో యుద్ధం, విజయానికి ప్రతీకలా భావించే శివుడి తనయుడు కార్తికేయుడి నేపథ్య కథాంశంతో భారీ హంగులతో దర్శకుడు త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.
భారతీయ పురాణాలకు సమకాలీన అంశాలను ముడిపెట్టి వినూత్నమైన కాన్సెప్ట్‌తో ఈ చిత్రానికి రూపకల్పన చేస్తున్నారని తెలిసింది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ మొదలుపెట్టారు. ఇటీవల ఆయన ఫ్యామిలీతో కలిసి ముంబయి వెళ్లారు. ఎయిర్‌పోర్ట్‌లో మీడియా క్లిక్‌మనిపించిన ఫొటోల్లో ఎన్టీఆర్ చేతిలో మురుగన్ అనే పుస్తకం కనిపించింది.
దీంతో ఆయన తన పాత్ర మురుగన్ (కార్తికేయుడు, కుమారస్వామి) తాలూకు పౌరాణిక ప్రాశస్త్యాన్ని తెలుసుకునే పనిలో ఉన్నారని అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు. సమకాలీన తెలుగు హీరోల్లో పౌరాణిక పాత్రలకు ఎన్టీఆర్ పర్ఫెక్ట్ ఛాయిస్ అనే పేరుంది. దీంతో ఈ సినిమా ప్రకటనకు ముందే అందరిలో ఆసక్తిని పెంచుతున్నది.