అగ్ర హీరో ఎన్టీఆర్ నటిస్తున్న పీరియాడిక్ పానిండియా యాక్షన్ డ్రామా ‘డ్రాగన్'(వర్కింగ్ టైటిల్). ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. ఎన్టీఆర్ కెరీర్లోనే గుర్తుండిపోయేలా ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్‌నీల్ తెరకెక్కిస్తున్నారని మేకర్స్ చెబుతున్నారు. ఇందులో ఎన్టీఆర్ పాత్ర నెవర్ బిఫోర్ అనే స్థాయిలో ఉంటుందని తెలుస్తున్నది. కథ డిమాండ్ మేరకు ఈ సినిమా కోసమే భారీగా బరువు తగ్గారు తారక్. ఇప్పటివరకూ కర్ణాటకలోనూ విదేశాల్లోనూ కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.
ప్రస్తుతం భాగ్యనగరంలో చిత్రీకరణ జరుగుతున్నది. 1969 కాలంలో చైనా, బూటాన్, ఇండియా సరిహద్దు ప్రాంతాల నేపథ్యంలో ఈ కథ సాగుతుందని, తల్లి సెంటిమెంట్ ఈ సినిమాకు ప్రధాన బలమని, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇందులో ఎన్టీఆర్ తల్లిగా సీనియర్ బాలీవుడ్ నటి కాజోల్ నటిస్తున్నారని, అలాగే మలయాళ నటుడు టివినో థామస్ కీలక పాత్రలో కనిపించి అందర్నీ సర్ప్రైజ్ చేస్తారని మేకర్స్ చెబుతున్నారు. రుక్మిణీ వసంత్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీమేకర్స్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈచిత్రానికి సమర్పణ: ఎన్టీఆర్ ఆర్ట్స్.