ఎన్టీఆర్ కెరీర్ క్షిపణిలా దూసుకుపోతున్నది. ఆయన లైనప్ మామూలుగా లేదు. ప్రస్తుతం ఆయన ‘వార్ 2’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ఆయన గ్రేషేడ్స్ ఉన్న పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. హృతిక్ రోషన్ మరో హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ఆయాన్ ముఖర్జీ దర్శకుడు. యష్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్నది. ఈ సినిమా తర్వాత ఆయన ప్రశాంత్‌నీల్ సినిమా చేస్తారు. మైత్రీమూవీ మేకర్స్ నిర్మించే ఈ సినిమా.. వచ్చే ఏడాది ప్రారంభంలో మొదలై, 2026 సంక్రాంతికి విడుదల కానుంది.
మరోవైపు నెల్సన్ దర్శకత్వంలో సితార ఎంటైర్టెన్మెంట్స్ నిర్మించనున్న సినిమాకు సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయి. మొత్తంగా 2028 వరకూ తారక్ డైరీ ఖాళీ లేదు. ఇదిలావుంటే.. తారక్‌తో యష్‌రాజ్ ఫిల్మ్స్ వారు చర్చలు జరుపుతున్నారనేది బాలీవుడ్ మీడియాలో వినిపిస్తున్న లేటెస్ట్ న్యూస్. వారి సంస్థ నుంచి తారక్ కథానాయకుడిగా ఓ భారీ చిత్రం రూపొందనున్నదట. దీనికి కూడా ‘వార్ 2’ దర్శకుడు అయాన్ ముఖర్జీనే దర్శకుడిగా ఉంటారని సమాచారం.
ఈ సినిమాకు సంబంధించిన కథను కూడా అయాన్ సిద్ధం చేశారట. పూర్తిస్థాయి బాలీవుడ్ చిత్రంగా రూపొందించి, పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలనే సంకల్పంతో యష్‌రాజ్ ఫిల్మ్స్ ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ సినిమాకు సంబంధించిన వివరాలు త్వరలో బహిర్గతం కానున్నాయి.