Tollywood | ఇండస్ట్రీలో ఎవరి టైం ఎప్పుడెలా మారుతుందో ఊహించడం కూడా కష్టమే. ఇప్పుడు ఇదే జరుగుతుంది. నిన్న మొన్నటి వరకు సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా బిజీగా ఉన్న కొందరు నటులు ఉన్నట్టుండి హీరోలుగా మారిపోతున్నారు. వాళ్లతో సినిమాలు చేయడానికి నిర్మాతలు కూడా ముందుకు వస్తున్నారు. తాజాగా టాలీవుడ్ మోస్ట్ బిజీయస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రావు రమేశ్ హీరోగా మారిపోయాడు. ఈయన కంటే ముందు అజయ్ ఘోష్ కూడా హీరో అయ్యాడు.
రావు గోపాలరావు నట వారసుడుగా ఇండస్ట్రీకి వచ్చిన రావు రమేశ్ 15 ఏళ్లుగా తెలుగు ఇండస్ట్రీలో విభిన్నమైన పాత్రలు చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. తాజాగా ఆయన హీరోగా మారుతీనగర్ సుబ్రహ్మణ్యం అనే సినిమా వస్తుంది. ఆయన సరసన ఇంద్రజ నటించారు. లక్ష్మణ్ కార్య ఈ చిత్రానికి దర్శకుడు. తాజాగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ప్రేక్షకులే ముఖ్య అతిథులుగా వినూత్నంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ‘మారుతీనగర్ సుబ్రహ్మణ్యం’ ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా రావు రమేష్ ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియో చివర్లో ఆ క్యూఆర్ ఇచ్చారు. అది స్కాన్ చేస్తే ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుంది.
రావు రమేశ్ సంగతి ఇలా ఉంటే మరో క్యారెక్టర్ నటుడు అజయ్ ఘోష్ కూడా ఈ మధ్య హీరో అయ్యాడు. మ్యూజిక్ షాప్ మూర్తి అనే సినిమాతో హీరోగా మారాడు అజయ్. ఇందులో చాందిని చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. శివ పాలడుగు దర్శకుడు. 50 ప్లస్‌లో హీరోలుగా మారడం అంటే చిన్న విషయం కాదు. కానీ రావు రమేశ్, అజయ్ ఘోష్ లాంటి క్యారెక్టర్ ఆర్టిస్టులకు ఉన్న క్రేజ్ వాడుకోవాలని వాళ్లతో సినిమాలు చేస్తున్నారు దర్శకులు. చేయడం వరకు ఓకే కానీ.. థియేటర్లలో ఈ సినిమాలు ఎంతవరకు మెప్పిస్తాయనేది మాత్రం ఆసక్తికరమే.