Sai Pallavi | ‘బలగం’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలందుకున్నారు దర్శకుడు వేణు యెల్దండి. ఆయన తదుపరి చిత్రంగా ‘ఎల్లమ్మ’ను తెరకెక్కించబోతున్నారు. నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. తెలంగాణ నేపథ్యంలో గ్రామదేవతల చుట్టూ తిరిగే సోషల్డ్రామా ఇదని సమాచారం. ఈ సినిమాలో కథానాయికగా సాయిపల్లవి నటించనున్నట్లు వార్తలొచ్చాయి. కథలోని కొత్తదనం, భావోద్వేగాలు నచ్చడంతో ఆమె ఈ సినిమాకు వెంటనే అంగీకరించిందని కథనాలొచ్చాయి. తాజా సమాచారం ప్రకారం సాయిపల్లవి ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలిసింది.
ఈ చిత్రం మే లేదా జూన్ నెలలో సెట్స్‌మీదకు వెళ్లనుంది. అయితే ఆ సమయంలో సాయిపల్లవి డేట్స్ ఖాళీగా లేవని, ఇతర సినిమాలతో ఉన్న ముందస్తు కమిట్మెంట్ కారణంగా ఆమె ‘ఎల్లమ్మ’ నుంచి అయిష్టంగానే తప్పుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. ‘ఎల్లమ్మ’లో సాయిపల్లవి కథానాయికగా నటించడం లేదని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హీరో నితిన్ వెల్లడించడం కూడా ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నది. కథానుగుణంగా స్టార్ హీరోయిన్ అవసరం కావడంతో కీర్తి సురేష్, రష్మిక మందన్న వంటి అగ్ర తారలను ఈ సినిమా కోసం సంప్రదించే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలిసింది. ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే అంటున్నారు.