Immanuel Bigg Boss | ప్రముఖ కమెడియన్, ‘జబర్దస్త్’ ఫేమ్ ఇమ్మాన్యుయేల్ బిగ్ బాస్ తెలుగు సీజన్లో తనదైన ముద్ర వేశారు. హౌస్‌లో తన కామెడీ టైమింగ్‌తో అందరినీ అలరించిన ఆయన, టాప్-4 ఫైనలిస్ట్‌గా నిలిచి గౌరవప్రదంగా బయటకు వచ్చారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఇమ్మాన్యుయేల్, తన బిగ్ బాస్ అనుభవాలను పంచుకుంటూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్స్ అందరూ నటిస్తారనే విమర్శలపై ఇమ్మాన్యుయేల్ స్పందిస్తూ.. “బిగ్ బాస్ ఇంట్లో ప్రతి ఒక్కరూ నటిస్తారని బయట అనుకుంటారు. కానీ గంటల తరబడి, రోజుల తరబడి, వారాల పాటు నిరంతరం నటించగలిగే మహానటులు ఈ ప్రపంచంలో ఇంకా పుట్టలేదు. అక్కడ ప్రతి ఒక్కరి అసలు వ్యక్తిత్వం ఏదో ఒక సమయంలో బయటకు వస్తుంది” అని స్పష్టం చేశారు.
హౌస్‌లో తోటి కంటెస్టెంట్లతో తనకున్న అనుబంధాన్ని ఇమ్మాన్యుయేల్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ముఖ్యంగా సంజనాతో తనకు ఏర్పడిన స్నేహం చాలా ప్రత్యేకమైనదని, అది జీవితాంతం కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక ఈ సీజన్ విజేతగా నిలిచిన కల్యాణ్ కు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపారు. తనకు మొదటి స్థానం దక్కలేదన్న బాధ లేదని, టాప్-4 వరకు రావడం, ప్రేక్షకుల ప్రేమని గెలవడం పట్ల తాను చాలా సంతృప్తిగా ఉన్నానని పేర్కొన్నారు. బిగ్ బాస్ తనకు జీవిత పాఠాలను నేర్పిందని, ఇక్కడ నేర్చుకున్న విలువలను భవిష్యత్తులోనూ పాటిస్తానని చెప్పారు. తన ప్రయాణంలో అండగా నిలిచిన అభిమానులకు, ముఖ్యంగా “విజనరీ వౌస్” (Visionary Vows) సంస్థకు ఇమ్మాన్యుయేల్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.