మనసులోని అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టడం శృతిహాసన్ ప్రత్యేకత. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పెళ్లిపై తన అభిప్రాయాన్ని చెప్పారు శృతిహాసన్. అలాగే తన కెరీర్ గురించి కూడా ఆసక్తికరంగా మాట్లాడారామె. ‘వైవాహిక వ్యవస్థపై నాకు నమ్మకం ఉంది. అది ఇద్దరు వ్యక్తుల జీవితాలకు సంబంధించిన అంశం. దాన్ని ధృవీకరించడానికి చట్టపరమైన కాగితం అవసరం లేదని నా అభిప్రాయం. నేను కూడా ఒకసారి పెళ్లికి దగ్గరగా వెళ్లాను. కానీ ముడిపడలేదు. ఇద్దరు మనుషులు ఒక్కటి అవ్వాలంటే ముందు వారి అభిప్రాయాలు కలవాలి. అది ఓ జీవిత కాలపు బాధ్యత. అందుకే కొందరికి అది సెట్ కాదు.’ అంటూ చెప్పుకొచ్చారు శృతిహాసన్. కెరీర్ గురించి మాట్లాడుతూ ‘నా కెరీర్లో తొలి విజయం మాత్రం ‘గబ్బర్‌సింగ్’ సినిమానే.
ఆ విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి నేనెప్పుడూ రుణపడి ఉంటా. ‘గబ్బర్‌సింగ్’ ఆఫర్‌ని కొన్ని కారణాల వల్ల రిజెక్ట్ చేశా. కానీ హరీశ్‌శంకర్ పట్టుబట్టి నాతో ఆ పాత్ర చేయించారు. అది నా జీవితాన్ని మార్చింది.’ అంటూ గుర్తు చేసుకున్నారు శృతిహాసన్. ‘కూలీ’ సినిమా గురించి మాట్లాడుతూ ‘తమిళ సినిమాకు మా నాన్న, రజనీకాంత్ రెండు కళ్లు లాంటివారు. ఇన్నాళ్లూ రజనీ అంకుల్ని మా నాన్న దృష్టికోణంలోనే చూశాను. ఇప్పుడు ఆయనతో డైరెక్టర్‌గా వర్క్ చేస్తుంటే ఆయనెందుకు సూపర్‌స్టార్ అయ్యారో అర్థమైంది. రజనీసార్ ఎనర్జీకి ఎవరూ సరితూగరు. అమితాబ్, కమల్‌హాసన్, రజనీకాంత్.. ఈ ముగ్గురినీ ఒకరితో ఒకర్ని పోల్చలేం. ముగ్గురూ ముగ్గురే.’ అంటూ శృతిహాసన్ పేర్కొన్నారు.