Actress | ఈ మధ్య కాలంలో సెలబ్రిటీల ప్రేమ, పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో ఎంతగా హల్చల్ చేస్తుంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొందరు అఫీషియల్‌గా ప్రకటిస్తుండగా, మరి కొందరు మాత్రం పెళ్లి వరకు ఆ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచుతారు. టాలీవుడ్లో తన చక్కని నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి నివేదా పేతురాజ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ, తనకు ఇటీవలే ఎంగేజ్మెంట్ జరిగినట్టు తెలిపారు. అంతేకాకుండా తన కాబోయే వరుడిని అభిమానులకు పరిచయం చేస్తూ ఓ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
నివేదా తన జీవిత భాగస్వామి పేరు రాజ్‌హిత్ ఇబ్రాన్ అని తెలియజేసింది. ఆయన ఒక ప్రముఖ వ్యాపారవేత్తగా చెబుతున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం, రాజ్‌హిత్ దుబాయ్‌కు చెందిన బిజినెస్ మ్యాన్ అని టాక్. ఈ ఏడాది చివర్లో వీరి వివాహ వేడుక జరగనున్నట్లు టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా ఈ పెళ్లిని జరపాలని భావిస్తున్నారట. వివాహ తేదీ, వేదిక వంటి వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.
ఈ శుభవార్త బయటకు రావడంతో నివేదా అభిమానులు, పరిశ్రమలోని శ్రేయోభిలాషులు ఆమెకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తమిళంలో ‘ఒరు నాల్ కూతు’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన నివేదా, తెలుగులో ‘మెంటల్ మదిలో’ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ‘చిత్రలహరి’, ‘బ్రోచేవారెవరురా’, ‘అల వైకుంఠపురములో’, ‘రెడ్’, ‘విరాటపర్వం’, ‘పాగల్’, ‘దాస్ కా ధమ్కీ’, ‘బ్లడీ మేరీ’ వంటి చిత్రాల్లో నటించి టాలీవుడ్ ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. ప్రస్తుతం సినిమాలకు కొంత గ్యాప్ తీసుకున్న నివేదా, వ్యక్తిగత జీవితాన్ని మరో అధ్యాయంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఆమె కొత్త జీవితం సంతోషంగా, ప్రశాంతంగా సాగాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.