Nithya Menon | దిగ్గజ నటి, దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత(Former CM Jayalalitha) బయోపిక్‌లో నేషనల్ అవార్డు విన్నర్ నిత్య మీనన్ నటించబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ‘ది ఐరెన్ లేడీ’(The Iron Lady) పేరుతో ప్రియదర్శని అనే దర్శకురాలు ఈ సినిమాను తెరకెక్కించున్నట్లు మేకర్స్ తెలిపారు. దీనికి సంబంధించి ఫస్ట్ లుక్‌ని కూడా విడుదల చేసింది చిత్రబృందం. అయితే అనుకొని కారణాల వలన ఈ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయింది. కాగా ఈ చిత్రం ఆగిపోవడానికి గల కారణాన్ని తాజాగా వెల్లడించింది నటి నిత్య.
తలైవి జయలలిత బయోపిక్ చేయాలని మేం ఎంతో ఆశపడ్డాం. దీనికి సంబంధించి నా ఫస్ట్ లుక్ కూడా చిత్రబృందం విడుదల చేసింది. అయితే మా సినిమా ప్రకటించిన వెంటనే ‘తలైవి’ అని సినిమా వచ్చింది. కంగనా రనౌత్ నటించిన ఈ చిత్రం నేరుగా థియేటర్లలోనే విడుదలయ్యింది. అయితే ఈ సినిమా వచ్చాక మేం కూడా అదే కథతో వస్తే రిపీటవుతుంది కదా అని సందేహించాం. కానీ మా నాన్న మాత్రం జయలలిత బయోపిక్‌లో కచ్చితంగా నటించమని అడిగారు. ఈ క్రమంలోనే ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా.. రమ్య కృష్ణ క్వీన్ అంటూ జయలలిత బయోపిక్ వెబ్ సిరీస్ వచ్చింది. దీంతో ఒకే కథతో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాక.. మేం కూడా చేస్తే కచ్చింతంగా రిపీట్ అవుతుందని అనుకుని ఈ ప్రాజెక్ట్‌ని మధ్యలోనే ఆపేశాం అంటూ నిత్య మీనన్ వెల్లడించింది.
గతేడాది తిరుచిత్రబలం సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న ఈ భామ.. ఆ తర్వాత వరుస ప్రాజెక్ట్‌లను లైన్లో పెడుతుంది. ఇటీవల నిత్య కథానాయికగా నటించిన తమిళ చిత్రం ‘కాదలిక్క నేరమిల్లై’ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలైంది. జయం రవి హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ మిక్స్డ్ టాక్‌తో రన్ అవుతుంది. ప్రస్తుతం ధనుష్ దర్శకత్వంలో వస్తున్న ‘ఇడ్లీ కడై’ అనే సినిమాలో నటిస్తుంది ఈ భామ.