గోవాలో జరుగుతున్న అంతర్జాతీయ సినిమా పండుగలో పాల్గొన్న నటి నిత్యామీనన్.. పాత్రల ఎంపిక గురించి ఆసక్తికరంగా మాట్లాడింది. ‘నటన అనేది భావోద్వేగానికి సంబంధించిన విషయం. దానికి అనుభవంతో పనిలేదు. అనుభవించి నటిస్తే చాలు. తల్లి పాత్ర చేయాల్సొచ్చిందనుకోండి. దానికి అనుభవం కావాలంటే ఎలా? ఆ ఫీల్‌ని ఎంజాయ్ చేస్తే చాలు. ఆ భావోద్వేగాన్ని తెరపై చూపగలిగితే ఆర్టిస్టుగా మనం సక్సెస్ అయినట్టే. ముందు పాత్రపోషణ విషయంలో నటీనటులకు ఆత్మవిశ్వాసం ఉండాలి.
మనసు ప్రశాంతంగా ఉండాలి. లేదంటే ఆ ప్రభావం క్యారెక్టర్‌పై పడుతుంది. ఉదాహరణకు గతంలో కొన్ని కారణాలవల్ల నేను విచారంగా ఉండేదాన్ని. దాంతో ఏడ్చే సన్నివేశాలు తేలిగ్గా చేసేసేదాన్ని. ఇప్పుడు అలాంటి పాత్రలు చేయడం కష్టంగా ఉంది. బహుశా నేను ఆనందంగా ఉండటం వల్ల కావొచ్చు. ఏదేమైనా.. ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే పాత్రల్ని ఎంచుకుంటే గుర్తింపు అదే వస్తుంది.’ అంటూ చెప్పుకొచ్చింది జాతీయ ఉత్తమనటి నిత్యామీనన్.