Swayambhu | హీరో నిఖిల్ సిద్ధార్థ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పీరియడ్ వార్ యాక్షన్ డ్రామా ‘స్వయంభు’ మరోసారి వార్తల్లోకి వచ్చింది. కొంతకాలంగా చిత్ర బృందం నుంచి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో ఫ్యాన్స్ నిరుత్సాహంలో ఉన్నారు. అయితే , ఈ రోజు మేకర్స్ చిత్రం విడుదల తేదీని ప్రకటించారు. ‘కార్తికేయ 2’తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నిఖిల్ ఇప్పుడు మళ్లీ పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. మొదటిసారి దర్శకుడిగా మారుతున్న భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ డ్రామా 2026 ఫిబ్రవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. సినిమా మొత్తం ఎనిమిది భాషల్లో విడుదల కానుంది.
తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, చైనీస్, స్పానిష్, అరబిక్ భాషలలో మూవీని రిలీజ్ చేయనున్నారు. సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయిందని టీమ్ వెల్లడించింది. విడుదల తేదీ ప్రకటించిన సందర్భంగా, మేకర్స్ ‘రైజ్ ఆఫ్ స్వయంభు’ అనే స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో చిత్రంలోని భారీ స్కేల్, యుద్ధ సన్నివేశాలు, పీరియడ్ సెట్లు, నిఖిల్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ వీడియోతో చిత్రం పై ఉన్న హైప్ మరింత పెరిగింది. త్వరలో ప్రమోషన్లు పెద్ద ఎత్తున ప్రారంభం కానున్నాయి. ఈ చిత్రంలో సమ్యుక్తా, నభా నటేష్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఇద్దరి పాత్రలు కూడా ప్రత్యేకంగా డిజైన్ చేసినట్టు సమాచారం.
ఈ భారీ చిత్రాన్ని పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ నిర్మిస్తుండగా, ప్రముఖ నిర్మాత టాగూర్ మధు ఈ సినిమాను ప్రెజెంట్ చేస్తున్నారు. సినిమాటోగ్రఫీ కె.కె. సెంథిల్ కుమార్ కాగా, ఇప్పటికే భారీ చిత్రాలకు కెమెరా వర్క్ అందించిన ఆయన విజువల్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ కానున్నాయి. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. యుద్ధ నేపథ్యం, భారీ సెట్స్, ఇంటెన్స్ కథ, పాన్-వరల్డ్ విడుదల ..ఈ అంశాలన్నీ కూడి ‘స్వయంభు’ను నిఖిల్ కెరీర్లో అత్యంత భారీ ప్రాజెక్ట్‌గా నిలబెడుతున్నాయి. విడుదల తేదీ అనౌన్స్మెంట్ తర్వాత పోస్టర్లు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2026 ఫిబ్రవరి వరకు కొత్త అప్డేట్లు, పోస్టర్లు, ట్రైలర్లు వరుసగా విడుదలయ్యే అవకాశం ఉంది.