Nikhil | వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తూ ఉన్న నటుడు నిఖిల్. కార్తికేయ 2 చిత్రంతో నిఖిల్ పాన్ ఇండియా స్టార్‌గా కూడా మారాడు . ఆయన ప్రస్తుతం `ది ఇండియా హౌస్` పేరుతో ఓ సినిమా చేస్తున్నారు. దీనికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సమర్పకులుగా వ్యవహరిస్తుండటం విశేషం. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే అనుకోకుండా ఈ మూవీ సెట్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ శంషాబాద్‌లో సమీపంలో జరుగుతుంది. షూటింగ్లో భాగంగా సముద్రం సీన్లు తీసేందుకు భారీగా సెట్ ఏర్పాటు చేశారు. దీంతోపాటు భారీగా వాటర్ ట్యాంక్‌ని కూడా ఏర్పాటు చేశారు. వాటర్ ట్యాంక్ ఒక్కసారిగా కూలిపోవడంతో పలువురు సాంకేతిక సిబ్బంది గాయపడ్డారు. ఈ ఘటనతో సినిమా సెట్ మొత్తం జలమయమైంది
ఈ ప్రమాదంతో సినిమాకు తీవ్ర నష్టం వాటిల్లినట్టు సమాచారం. వాటర్ ట్యాంకర్ పేలడంతో నీళ్లన్నీ సెట్లోకి వరదలా పోటెత్తడం వలన సెట్ నాశమైందని సమాచారం. ఇక లైట్లు.. కెమెరాలు.. ఇతర సినిమా షూటింగ్ సామగ్రి దెబ్బతిందని చిత్రబృందం తెలిసింది. ఇక సెట్లో నిఖిల్ ఉన్నాడా, లేదా అనే సందేహం అందరిలో ఉండగా, ఈ క్రమంలో నిఖిల్ స్పందించారు . తన సోషల్ మీడియా ద్వారా స్పందించిన నిఖిల్.. ప్రేక్షకులకు ఒక గొప్ప సినిమాటిక్ అనుభూతిని అందించే ప్రయత్నంలో కొన్నిసార్లు రిస్క్‌లు తప్పవని అన్నారు. అయితే అలాంటి సమయంలోనే ఈ ఘటన జరిగింది. మా సిబ్బంది తీసుకున్న తక్షణ జాగ్రత్తల వల్ల పెను ప్రమాదం నుంచి బయటపడ్డాం అని నిఖిల్ పేర్కొన్నారు.
కాకపోతే దురదృష్టవశాత్తూ కొన్ని ఖరీదైన పరికరాలను కోల్పోయాం. దేవుడి దయ వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు, అందరం సురక్షితంగా ఉన్నాం అని నిఖిల్ స్పష్టం చేశారు. ఈ సినిమాలో నిఖిల్ సరసన సయీ మంజ్రేకర్ కథానాయికగా నటిస్తుండగా, ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. 1905 కాలం నాటి ప్రేమ, విప్లవం వంటి అంశాలతో కూడిన ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ ప్రమాదం కారణంగా చిత్రీకరణకు స్వల్ప అంతరాయం కలిగినప్పటికీ, త్వరలోనే తిరిగి ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాదే మూవీని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.