Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు’ జూలై 24న గ్రాండ్‌గా విడుదలై థియేటర్లలో రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నటించిన కొందరు నటీనటులు అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే పవన్ కళ్యాణ్ పక్కన పొడుగ్గా కనిపించిన ఓ నటుడు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అతను మరెవరో కాదు ప్రముఖ నటి జయసుధ కుమారుడు నిహార్ కపూర్. ఈ సినిమాలో నిహార్ పోషించిన పాత్రకు ప్రత్యేకమైన డైలాగులు లేకపోయినప్పటికీ, అతని స్క్రీన్ ప్రెజెన్స్, హావభావాలు ప్రేక్షకుల మనసు దోచుకుంటున్నాయి.
ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌తో కలిసి కనిపించే సన్నివేశాల్లో నిహార్ పాత్ర ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నిహార్ నటనపై ఇటీవల జరిగిన సినిమా సక్సెస్ మీట్లో పవన్ కళ్యాణ్ కూడా ప్రశంసలు కురిపించారు. నిహార్ పాత్ర ‘ఫ్రాంటియర్ గాంధీ’ గా ప్రసిద్ధి చెందిన స్వాతంత్ర్య కార్యకర్త అబ్దుల్ గఫర్ ఖాన్ నుండి ప్రేరణ పొందిందని పవన్ ఇటీవల జరిగిన సక్సెస్ మీట్లో తెలియజేశారు. ఆయన పాత్రకు నిహార్ అద్భుతంగా న్యాయం చేశాడు అని చెప్పుకొచ్చారు. నిహార్ కపూర్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించగా, ఆయనకు రానన్న రోజులలో విలన్‌గా కూడా మంచి అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది.
నిహార్ కపూర్ 2022లో ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ సినిమాతో నటుడిగా తెరంగేట్రం చేశాడు. కానీ ‘హరిహర వీరమల్లు’ అతని కెరీర్లో మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. నిహార్ పాత్ర నెగెటివ్ షేడ్‌లో ఉన్నప్పటికీ, ప్రేక్షకులు దానిని స్వాగతిస్తున్నారు. ఈ పాత్రతో టాలీవుడ్ లో దర్శకుల కంట పడే అవకాశం అతనికి ఉందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.ఇకపోతే, క్రిష్ మరియు జ్యోతి కృష్ణ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఏఎం రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ట్రేడ్ విశ్లేషకుల అంచనాల ప్రకారం, ఈ చిత్రం ప్రీమియర్స్ మరియు ఓపెనింగ్ డే కలిపి రూ. 70 కోట్లకు పైగా వసూలు చేసే అవకాశముంది. దీనిపై అధికారులు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.