Pawan Kalyan |టాలీవుడ్‌తో పాటు రాజకీయ వర్గాల్లోనూ ఇప్పుడు ఒక వ్యాఖ్య పెద్ద చర్చకు దారి తీసింది. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి హీరోయిన్ నిధి అగర్వాల్ చేసిన అభిప్రాయాలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ సందర్భంగా పవన్‌ను దగ్గర నుంచి గమనించిన నిధి, తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన వ్యక్తిత్వం, రాజకీయ ప్రయాణంపై తన అభిప్రాయాన్ని భిన్నంగా వ్యక్తం చేశారు. సినిమా పరంగా ‘హరిహర వీరమల్లు’ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, ఆ చిత్రంలో పని చేసిన అనుభవం తనకు పవన్ కళ్యాణ్‌ను కొత్త కోణంలో అర్థం చేసుకునే అవకాశం ఇచ్చిందని నిధి తెలిపారు. ఆయనను కేవలం ఒక స్టార్‌గా కాకుండా, లోపల బలమైన నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తిగా తాను చూశానని చెప్పారు. పవన్‌లో కనిపించే ధైర్యం, తెగింపు సాధారణంగా ఎవరిలోనూ కనిపించదని, కష్టసమయాల్లో ఒంటరిగా నిలబడి పోరాడగల మనస్తత్వం ఆయనకు ఉందని ఆమె పేర్కొన్నారు.
నిధి అగర్వాల్ మాటల్లో పవన్ కళ్యాణ్ ఒక పవర్ఫుల్ లీడర్. ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఒక్కరోజులో ఎదిగిన వ్యక్తి కాదని, సంవత్సరాల పాటు క్రమంగా పార్టీని నిర్మించుకుంటూ, గ్రౌండ్ లెవల్లో పని చేస్తూ వచ్చిన నేత అని ఆమె గుర్తు చేశారు. ఎన్నికల్లో గెలవడంతో ఆయన పేరు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నప్పటికీ, ఆ విజయం వెనుక ఉన్న కృషి చాలా లోతైనదని ఆమె అభిప్రాయపడ్డారు.అందరినీ ఆశ్చర్యపరిచేలా, పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో దేశ అత్యున్నత పదవిని(పీఎం) కూడా అధిరోహించినా తనకు ఆశ్చర్యం ఉండదని నిధి వ్యాఖ్యానించారు. ఆయనలో ఉన్న విజన్, పట్టుదల, పది మంది కోసం నిలబడే స్వభావం ఒక నాయకుడికి అవసరమైన లక్షణాలన్నీ ఉన్నాయని ఆమె విశ్లేషించారు. ప్రస్తుతం కనిపిస్తున్న ఫలితాలు, గతంలో చేసిన శ్రమకు దక్కుతున్న గుర్తింపుగా ఆమె భావిస్తున్నారు.
పవన్ కళ్యాణ్‌తో కలిసి పనిచేసిన అనుభవం తనను వ్యక్తిగతంగా కూడా ప్రభావితం చేసిందని నిధి తెలిపారు. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా, స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్లడం, సమయాన్ని సమర్థవంతంగా వినియోగించడం పవన్‌కే సాధ్యమని ఆమె ప్రశంసించారు. ఇక నిధి అగర్వాల్ కెరీర్ విషయానికి వస్తే, ఇటీవల చేసిన భారీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను ఇవ్వకపోయాయి. ‘హరిహర వీరమల్లు’, అలాగే సంక్రాంతికి విడుదలైన ‘రాజాసాబ్’ వంటి చిత్రాలు ఆమెకు పెద్ద బ్రేక్‌ను అందించలేకపోయాయి. అయినప్పటికీ, కొత్త అవకాశాల కోసం ఆమె ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్‌పై ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు మాత్రం సినీ, రాజకీయ వర్గాల్లో మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి.