Nidhi agarwal | ఇటీవల హరిహర వీరమల్లు సినిమాతో ప్రేక్షకులని పలకరించిన నిధి అగర్వాల్ తాజాగా ఓ వివాదంలో చిక్కుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాహనాన్ని వినియోగించడంపై సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగుతోంది. ఒక పనిమీద విజయవాడకి వెళ్లిన నిధి ఏపీ ప్రభుత్వ వాహనంలో ప్రయాణించినట్లుగా పలు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిధులతో నిర్వహించే వాహనాలను వ్యక్తిగత, వాణిజ్య కార్యక్రమాలకు ఎలా ఉపయోగిస్తారంటూ మండిపడ్డారు. ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులకు మాత్రమే కేటాయించిన వాహనాలను ఒక ప్రైవేట్ కార్యక్రమానికి వినియోగించడమేంటని కొందరు నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.
భీమవరంలో జరిగిన ఓ స్టోర్ లాంచ్ ఈవెంట్‌కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాహనంలో నిధి హాజరు కావడం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో నిధి అగర్వాల్ తన అధికారిక ఎక్స్ (Twitter) ఖాతాలో స్పందిస్తూ, ఈ వివాదంపై స్పష్టత ఇచ్చారు. ‘‘భీమవరంలో జరిగిన ఈవెంట్లో పాల్గొనడానికి నిర్వాహకులు నాకు రవాణా సదుపాయం ఏర్పాటు చేశారు. వారు పంపిన వాహనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందినదై ఉండొచ్చు. కానీ, వాహనం ఎంపికలో నా పాత్ర ఏమీ లేదు. ఇది కేవలం లాజిస్టికల్ అవసరాల కోసమే నిర్వాహకులు అందించిన సదుపాయం’’ అని నిధి తెలిపారు.
అంతేకాకుండా, కొన్ని ఆన్లైన్ వేదికల్లో ‘‘ప్రభుత్వ అధికారులు నిధి కోసం ప్రత్యేక వాహనం పంపించారు’’ అనే తప్పుడు ప్రచారం జరుగుతుండటాన్ని ఆమె ఖండించారు. ‘‘ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి. ప్రభుత్వ అధికారులెవ్వరూ నాకోసం ప్రత్యేకంగా వాహనం పంపలేదు. ఈ వ్యవహారంలో నాకు ఎలాంటి సంబంధం లేదు. తప్పుడు సమాచారం ప్రచారం కాకుండా ఉండేందుకు నిజాలను బయటపెట్టడం నా బాధ్యత’’ అని పేర్కొన్నారు. చివరగా, ఆమె తన అభిమానులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ‘‘మీ ప్రేమ, మద్దతు పట్ల ఎప్పుడూ కృతజ్ఞతలు. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను’’ అని నిధి అగర్వాల్ పేర్కొన్నారు.