అదృష్టమంటే బెంగళూరు భామ నిధి అగర్వాల్‌దే అంటున్నారు అభిమానులు. కెరీర్ ఆరంభంలో వరుస సినిమాలు చేసిన ఈ భామ ఒక్కసారిగా రేసులో వెనకబడిపోయింది. మూడేళ్ల పాటు తెలుగులో సినిమాలకు దూరమైంది. అయినా ఎక్కడా నిరాశపడకుండా మంచి అవకాశాల కోసం ఎదురుచూసింది. ఏకంగా పవన్‌కల్యాణ్, ప్రభాస్ వంటి అగ్ర హీరోల సినిమా ఛాన్స్‌లు కొట్టేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు ‘హరిహర వీరమల్లు’, ‘రాజా సాబ్’ చిత్రాల్లో కథానాయికగా నటిస్తున్నది. తాను కావాలని తెలుగులో గ్యాప్ తీసుకోలేదని, అనుకోని కారణాల వల్ల వచ్చిందని, రాబోవు రోజుల్లో మంచి విజయాలను సొంతం చేసుకుంటానని ధీమా వ్యక్తం చేసింది. ‘లాక్‌డౌన్‌కు ముందే ‘హరిహర వీరమల్లు’ సినిమాకు సైన్ చేశా. ఈ సినిమా పూర్తయ్యే వరకు ఇతర చిత్రాల్లో నటించొద్దని వారి టీమ్ నాతో కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. ఇంతలో కరోనా రావడంతో మూడున్నరేళ్లు గడచిపోయాయి. ‘ది రాజాసాబ్’లో అవకాశం వచ్చినప్పుడు ‘హరిహర వీరమల్లు’ టీమ్‌ను సంప్రదించాను. సినిమా ఛాన్స్ గురించి చెప్పగా.. వారు వెంటనే అంగీకరించారు. అలా రెండు భారీ ప్రాజెక్ట్స్‌లో భాగమయ్యా. ఈ రెండు సినిమాలు నాకు విజయంతో పాటు మంచి పేరు తీసుకొస్తాయనే నమ్మకం ఉంది. భవిష్యత్తులో అన్నీ మంచి రోజులే అనే విశ్వాసంతో ఉన్నా’ అని నిధి అగర్వాల్ చెప్పింది.