స్టార్ రైటర్ స్థాయి నుంచి స్టార్ డైరెక్టర్ స్థాయికి ఎదిగిన త్రివిక్రమ్ శ్రీనివాస్.. ‘పానిండియా డైరెక్టర్’ ఇమేజ్ కోసం పోరాటం మొదలుపెట్టారు. ఆయుధంగా బన్నీ దొరికేశాడు. ఇక యుద్ధం చేయడమే తరువాయి. బేసిగ్గా రైటర్ కావడంతో పురాణాల్లోని వీరగాధలపై దృష్టి సారించాడు. దేవతల సేనాని, శివకుమారుడైన కార్తికేయుడిపై ఆయన కన్ను పడింది. అంతే.. కార్తికేయ పురాణం బేస్‌గా కథ తయారైంది. ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న వార్త ఇది. 300కోట్ల భారీ బడ్జెట్‌తో గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మించనున్నారట.
జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురములో చిత్రాలతో ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టేశారు త్రివిక్రమ్, బన్నీ. వారిద్దరి కలయికలో రానున్న నాలుగవ సినిమా ఇది. ముఖ్యంగా పుష్పరాజ్ పానిండియా స్థాయి విరాట్ స్వరూపావిష్కరణ తర్వాత రానున్న సినిమా కావడంతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల దృష్టి ఈ సినిమాపై పడటం సహజం. దానికి తగ్గట్టే ఊహలకు అతీతమైన గెటప్‌ను, సెటప్‌ను సిద్ధం చేసేశారట త్రివిక్రమ్. ముందు ఈ సినిమాను ఏప్రిల్‌లో మొదలుపెట్టాలని మేకర్స్ భావించినా.. తాజా సమాచారం ప్రకారం ఈ నెలాఖరునే షూటింగ్ మొదలు కానున్నట్టు తెలుస్తున్నది. ఇది బన్నీ అభిమానులకు నిజంగా శుభవార్తే. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తారట.