Coolie | ఈ రోజుల్లో సినిమాలకి ప్రమోషన్స్ కీలకంగా మారుతున్నాయి. జనాల్లోకి వీలైనంత మేరకు తీసుకెళ్లాలని చిత్ర నిర్మాతలు కొత్తగా ప్రమోషన్స్ చేస్తూ అందరు ఆశ్చర్యపోయేలా చేస్తున్నారు. ఒకప్పుడు సినిమా రిలీజ్ ముందు ఆడియో వేడుకలు గ్రాండ్ గా జరుగుతుండేవి. ఆ తరువాత అవి “ప్రీ-రిలీజ్ ఈవెంట్స్”గా మారాయి. అయితే తమిళ ఇండస్ట్రీలో మాత్రం ఇప్పటికీ ఆడియో ఫంక్షన్స్‌కు ప్రాధాన్యం ఉంది. తాజాగా రజనీకాంత్ నటిస్తున్న కూలీ సినిమా కోసం చేసిన ఈవెంట్ కూడా అందుకు ఉదాహరణే. అయితే దీన్ని కేవలం ఆడియో ఈవెంట్‌గా కాకుండా, కూలీ అన్లీష్డ్ అనే పేరుతో మరింత విభిన్నంగా నిర్వహించారు.
ఈ వేడుకను సన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ ప్రత్యేకంగా నిర్వహించింది. అయితే ఈ ఈవెంట్‌కు యూట్యూబ్ లైవ్ లేకుండా, వేరే మీడియా ఛానెళ్లకు కూడా ఫీడ్ ఇవ్వకుండా, తమ సొంత ఛానెల్ అయిన Sun TVలో మాత్రమే ఎక్స్‌క్లూజివ్‌గా ప్రసారం చేశారు. ఇప్పుడు ఈ ఈవెంట్‌ను తెలుగులో కూడా ప్రసారం చేయబోతున్నారు! ఆగస్టు 15న రాత్రి 9:30కి, సన్ నెట్‌వర్క్‌లో భాగమైన Gemini TVలో ఈ ఈవెంట్‌ను ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు చూపించబోతున్నారు. సాధారణంగా తమిళ సినిమాలకు తెలుగు ప్రెస్ మీట్లు, చిన్న చిన్న ప్రమోషన్లూ జరుగుతుంటాయి. కానీ చెన్నైలో జరిగిన ఒక తమిళ ఈవెంట్‌ను తెలుగులోనూ ప్రసారం చేయడం మాత్రం ఎంతో ప్రత్యేకం. ఈ తరహాలో జరగడం ఇదే తొలిసారి కావచ్చన్న అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి.
అదీ కాకుండా, ఈ ఈవెంట్లో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తమిళంలో పెర్ఫామ్ చేసిన పాటల బదులు కూలీ తెలుగు సాంగ్స్ వినిపించనున్నారు. అలాగే స్పీచులకు కూడా తెలుగు వాయిస్ ఓవర్ చేయడం ద్వారా, తెలుగు ప్రేక్షకుడికి ఒక సొంత ఈవెంట్ అనిపించేలా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటిదాకా తమిళ సినిమాలను మాత్రమే తెలుగులో డబ్ చేస్తూ చూశాం. కానీ ఇప్పుడు ఈవెంట్లను కూడా అనువదించడం చూసి ఈ రోజుల్లో ప్రమోషన్ల రేంజ్ ఇంత మారిందా? అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా కూలీ సినిమాకు తెలుగు మార్కెట్లో టీం ఎంతగా ప్రాధాన్యం ఇస్తోందో స్పష్టంగా అర్ధమవుతుంది. అయితే కొంతమంది అభిప్రాయం ప్రకారం రజినీకాంత్‌ని హైదరాబాదుకు తీసుకు వచ్చి ఒక ప్రత్యేక ప్రెస్ మీట్ చేసి ఉంటే ఇంకా బాగుండేది అని చెబుతున్నారు. మొత్తానికి, రజినీకాంత్ సినిమాలకు తెలుగులో ఎప్పుడూ ఓ క్రేజ్ ఉంటుందనేది తెలిసిందే. పైగా ఈసారి దర్శకుడు లోకేష్ కనకరాజ్, విలన్‌గా నాగ్, ఉపేంద్ర కూడా ఉన్న నేపథ్యంలో కూలీపై చాలా ఆసక్తి నెలకొంది. మరోవైపు ఆగస్టు 14న వార్ 2తో పాటు కూలీ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో, బాక్సాఫీస్ దగ్గర పోటీ ఓ రేంజ్లో ఉండనుందని అంటున్నారు.