Devara | ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘దేవర’ నిర్మాణం నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నది. రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తుండగా, సైఫ్అలీఖాన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. విస్మరణకు గురైన ఓ తీర ప్రాంతం నేపథ్యంలో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
దసరా కానుకగా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకురానుంది. కాగా ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఓ ఆసక్తికరమైన న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్నది. అనుకున్న సమయానికంటే రెండు వారాల ముందుగానే ‘దేవర’ ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడని సమాచారం. సెప్టెంబర్ 27కు ఈ చిత్రాన్ని ప్రీపోన్ చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అదే తేదీకి పవన్‌కల్యాణ్ ‘ఓజీ’ విడుదల కావాల్సి ఉంది. అయితే షూటింగ్లో ఆలస్యం కారణంగా రిలీజ్‌ను వాయిదా వేశారు. ఇప్పుడు అదే తేదీకి ‘దేవర’ రానుందనే టాక్ వినిపిస్తున్నది. అయితే ఇవి కేవలం ఊహాగానాలు మాత్రమేనని, చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చినప్పుడే ఈ విషయంలో స్పష్టత వస్తుందని చెబుతున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై సుధాకర్, హరికృష్ణ కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ స్వరకర్త.