సృష్టిలో అందరికన్నా గొప్పది ‘అమ్మ’! సాధారణ మహిళలు మొదలుకొని.. సెలెబ్రిటీల వరకూ అమ్మతనాన్ని వరంగా భావించే వాళ్లే! ప్రస్తుతం బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె కూడా.. మాతృత్వపు మధురిమల్లో మునిగితేలుతున్నది. ఈ నెల 8న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా.. తాజాగా, పిల్లల ఆహారపు అలవాట్లపై ఓ ఫన్నీ వీడియోను ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నది.
Deepika Padukone | ‘పెద్దలు కూడా చిన్నపిల్లల్లా తింటే!?’ అనే శీర్షికతో దీపిక చేసిన పోస్ట్.. నవ్వు తెప్పిస్తున్నది. సోఫాలో పడుకున్న ఒక మహిళ నిద్రలేచి.. భోజనం చేయడానికి వంటగదికి వెళ్లడం.. ప్లేట్ వైపు చూస్తూ, డైనింగ్ టేబుల్ వద్ద గజిబిజిగా తినడానికి ప్రయత్నించడం ఈ వీడియోలో కనిపిస్తుంది. సదరు మహిళ చిన్నపిల్లలా నోరు తెరిచి, తలను ఆడిస్తూ.. చేతిలోని సాండ్విచ్ను ఒక్కసారి కొరికి వెంటనే నిద్రలోకి జారుకోవడం కాస్త ఫన్నీగా ఉంది. బాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ దీపిక పదుకొణె – రణవీర్ సింగ్.. ఇటీవల పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చారు. సోషల్‌మీడియా వేదికగా తమ సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు.
అప్పటినుంచి ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోయినా.. దీపిక మాత్రం తన ఇన్‌స్టా బయోను ‘ఫీడ్ బర్ప్ స్లీప్ రిపీట్’గా మార్చుకున్నది. అయితే, ప్రస్తుతం సినీ సెలెబ్రిటీల ఇండ్లలో ‘నానీ’ల సంస్కృతే నడుస్తున్నది. తమ పిల్లల సంరక్షణ కోసం ‘ఖరీదైన నానీ’లను నియమించుకోవడం ఇప్పుడు స్టేటస్ సింబల్‌గానూ మారింది. అయితే, దీపిక మాత్రం తన బిడ్డ కోసం ‘నానీ’ని నియమించడం లేదని బీటౌన్‌లో టాక్. తన గారాలపట్టికి కావాల్సిన అన్ని సేవలనూ తానే స్వయంగా అందిస్తుందట. ఈ విషయంలో మరో అందాలతార ఐశ్వర్యరాయ్ బచ్చన్‌ను ఆదర్శంగా తీసుకున్నదట దీపిక.