Amitabh Bachchan| బుల్లితెర రియాలిటీ షోలలో కౌన్ బనేగా కరోడ్ పతికి ప్రత్యేకమైన స్థానం ఉంది. దాదాపు 15 సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ షోని ఎంతో మంది ఇష్టపడతారు. ముఖ్యంగా అమితాబ్ బచ్చన్ హోస్టింగ్ ఈ షోకి పెద్ద ప్లస్ పాయింట్. ఆయన లేకుండా ఈ షో అసంపూర్ణం. చాలా ఏళ్లుగా బిగ్ బీ ఈ షోని సక్సెస్ ఫుల్‌గా నడిపిస్తున్నారు. ఈ షోలో ఎక్కువ సీజన్స్‌కి అమితాబ్ బచ్చనే హోస్టింగ్ చేశారు. అయితే ఇప్పుడు ఆయన ఈ షోని వీడబోతున్నారనే వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇది విన్న అభిమానుల గుండె పగిలినంత పని అయింది. అమితాబ్ లేకుండా ఆ షోని అసలు చూడగలుగుతామా అని భావోద్వేగానికి గురవుతున్నారు.
అయితే అమితాబ్ కేబీసీ నుండి తప్పుకుంటే ఆయన స్థానంలో ఎవరు హోస్ట్‌గా వస్తారనే చర్చ నడుస్తుంది. నిజానికి బిగ్ బి ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ని వీడాలనే కోరిక వ్యక్తం చేయగానే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బ్రాండ్స్ , ఒక యాడ్ ఏజెన్సీ దీని కొత్త హోస్ట్ గురించి సర్వే చేసింది. అమితాబ్ బచ్చన్ స్థానంలో ఎవరు వస్తే బాగుంటుందని సర్వే నిర్వహించగా ఇందులో 408 మంది పురుషులు, 360 మంది మహిళల అభిప్రాయాలు తీసుకున్నారు. 768 మంది మధ్య చేసిన ఈ సర్వేలో హోస్ట్‌గా మొదటి పేరు సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ పేరు తెరపైకి వచ్చింది. ఆయన కేబీసీ మూడో సీజన్‌కి హోస్ట్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే.
ఇక సర్వేలో షారుఖ్ ఖాన్ తర్వాత ఎక్కువ మంది సూచించిన పేరు నటి ఐశ్వర్య రాయ్. ఆమె అమితాబ్ బచ్చన్ కోడలు కూడా. గతంలో ఆమె ఎప్పుడు ఏ షోకి హోస్ట్ చేసింది లేదు. కాని ఆమె హోస్ట్‌గా బాగుంటుంది అని కొందరు తమ అభిప్రాయ్ వ్యక్తం చేశారు. ఇక ఎంఎస్ ధోని కూడా ఈ షోకి హోస్ట్‌గా చేస్తే బాగుంటుందని అంటున్నారు. కాగా, బిగ్ బీ కేబీసీ తాజా ఎపిసోడ్లో కేబీసీ కార్యక్రమాన్ని వీడాలని అనుకుంటున్నట్టు తెలియజేసినట్టు సమాచారం. 82 ఏళ్ల అమితాబ్ బచ్చన్ కేబీసీ నుండి తప్పుకుంటే ఆయన స్థానంలో హోస్ట్‌గా ఎవరు వస్తారని అందరు ముచ్చటించుకుంటున్నారు.