Rishab Shetty | తెలుగు ప్రేక్షకులు అన్ని భాషల సినిమాలను ఆదరిస్తూ వస్తున్నా, ఇతర రాష్ట్రాల్లో మాత్రం తెలుగు సినిమాలపై అణచివేత చర్యలు కొనసాగుతుండటం పట్ల అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా “కాంతార చాప్టర్ 1” సినిమాపై బాయ్‌కాట్ ట్రెండ్‌గా మారింది. తెలుగు సూపర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న OG, అలాగే పుష్ప 2, హరిహర వీరమల్లు వంటి తెలుగు సినిమాలపై కర్ణాటకలో ఇటీవల పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. “తెలుగు టైటిల్ ఎందుకు?” అనే ఉద్దేశంతో కొన్ని ప్రదర్శనలను అడ్డుకోవడం, హాల్లలో గందరగోళం సృష్టించడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఒకవైపు తెలుగు సినిమాలపై అణచివేత కొనసాగుతున్నా, మరొకవైపు తెలుగు ప్రేక్షకులు మాత్రం ఇతర భాషా చిత్రాలకు పెద్ద ఎత్తున మద్దతు ఇస్తుండటంతో సోషల్ మీడియాలో ఈ ద్వంద్వ ప్రమాణాలపై చర్చ జోరుగా సాగుతోంది.
ఈ పరిణామాల మధ్య, రిషబ్ శెట్టి తెరకెక్కించిన “కాంతార చాప్టర్ 1″ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరగగా, ఆయన పూర్తిగా కన్నడ భాషలోనే ప్రసంగించారు. కనీసం ఇంగ్లీష్ లోనైనా మాట్లాడకుండా, తెలుగు ప్రదేశంలో కన్నడలోనే ప్రసంగించడంతో ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన ఎన్టీఆర్ ఉన్నప్పటికీ, రిషబ్ తన సంభాషణలో తెలుగు వాడకపోవడం, ప్రేక్షకుల మనోభావాలను పరిగణించకపోవడం పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు. ఇప్పటికే “బాయ్‌కాట్ కాంతార” అనే హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్, యూట్యూబ్ తదితర సోషల్ మీడియా వేదికల్లో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.
మంగ్లీ ఒకసారి కన్నడలో పాట పాడిందని దాడులు చేశారు. ఇప్పుడు రిషబ్ శెట్టి ఇక్కడికి వచ్చి కనీసం ఇంగ్లీష్ లోనైనా మాట్లాడకుండా, పూర్తిగా కన్నడలో మాట్లాడతారా?” అంటూ ప్రేక్షకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.తెలుగు సినిమాలకు అక్కడ గౌరవం ఉండదు, కానీ మేము మాత్రం మీ సినిమాల్ని ఆదరించాలా, ఇది ఎంతవరకు న్యాయం? అనే ప్రశ్నలు నెట్టింట్లో చర్చనీయాంశంగా మారాయి. బాలీవుడ్ నుంచి వచ్చిన హీరోయిన్లు కూడా తెలుగు స్టేజ్‌లపై “అందరికి నమస్కారం”, “నేను తెలుగు నేర్చుకుంటున్నాను” అంటూ ఆడియన్స్‌ను కనెక్ట్ చేసేందుకు ప్రయత్నిస్తుంటే, ఒక సౌత్ ఇండియన్ డైరెక్టర్, హీరో అయిన రిషబ్ ఇలా ప్రవర్తించడం ఏ మాత్రం బాలేదు అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ వివాదంపై రిషబ్ శెట్టి నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. కానీ ఆయన స్పందించాల్సిన అవసరం ఉందని నెటిజన్లు కోరుతున్నారు.