Naga Chaitanya-Sobhita | టాలీవుడ్ నటుడు నాగచైతన్య త్వరలోనే మరోసారి వివాహం చేసుకోనున్నారు. నటి శోభిత ధూళిపాళను మనువాడనున్నాడు. గత కొద్దిరోజులుగా రిలేషన్లో ఉన్న విషయం తెలిసిందే. గత ఆగస్టులో జంట సింపుల్‌గా నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం పెళ్లి పనులు చకాచకా సాగుతున్నాయి. డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఏర్పాటు చేసిన సెట్లో సంప్రదాయబద్దంగా పెళ్లి నిర్వహించనున్నట్లు అక్కినేని నాగార్జున ప్రకటించారు. పెళ్లి పనులను శోభిత, నాగచైతన్యనే దగ్గరుండి చూసుకుంటున్నారని తెలిపారు. ఇక వివాహ వేడుకకు బంధువులతో పాటు సినిమా, రాజకీయ ప్రముఖులను 300 మందిని ఆహ్వానించనున్నట్లు వెల్లడించారు. నాగచైతన్య-శోభిత పెళ్లికి అన్నపూర్ణ స్టూడియోస్ వేదిక కావడం తనకెంతో ఆనందంగా ఉందని, ఇది కేవలం స్టూడియో మాత్రమే కాదన్న నాగార్జున.. తమ కుటుంబ వారసత్వంలో ఒక భాగమని పేర్కొన్నారు.
స్టూడియో తన తండ్రి.. అక్కినేని నాగేశ్వరరావుకి ఎంతో ఇష్టమైన ప్రదేశమని తెలిపారు. పెళ్లిని చాలా సింపుల్‌గా చేయాలని చైతూ కోరినట్లు నాగార్జున పేర్కొన్నారు. సంప్రదాయ తెలుగు పద్ధతిలో పెళ్లి చేస్తున్నట్లు చెప్పారు. ఇక పెళ్లి తర్వాత జరిగే రిసెప్షన్‌కు సంబంధించిన వివరాలు త్వరలోనే తెలియజేస్తామన్నారు. ఇక నాగచైతన్య, శోభితా ధూళిపాళ వివాహం స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నది. స్ట్రీమింగ్ హక్కులను రూ.50కోట్లకు తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఇంతకు ముందు నయనతార సైతం పెళ్లి స్ట్రీమింగ్ హక్కులను నెట్ఫ్లిక్కి అమ్ముకున్న విషయం తెలిసిందే. తాజాగా నాగచైతన్య, శోభిత జంట సైతం అదే బాటలో వెళ్తున్నారు. అయితే, పెళ్లి వేడుకను లైవ్ స్ట్రీమింగ్ చేస్తారా? తర్వాత స్ట్రీమింగ్ చేస్తారా? అన్న విషయంపై స్పష్టత లేదు.